శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 22 ఏప్రియల్ 2024 (10:29 IST)

ఎన్నికల్లో ఇచ్చే ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి : ఆర్బీఐ మాజీ గవర్నర్

duvvuri
లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని, అలాగే, ఈ ఉచితాలపై వివరణాత్మక చర్చ జరగాలని భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఉచిత హామీల అమలుకు వెచ్చించే సొమ్మును మరింత ప్రయోజనకరంగా ఉపయోగించే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇందుకోసం ఉచిత హామీలు, వాటి అమలు వల్ల ప్రభుత్వ ఖజానాపై పడిన భారం.. తదితర వివరాలతో ఓ శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని డి సుబ్బారావు డిమాండ్ చేశారు.
 
ఎన్నికలవేళ ఎడాపెడా ఉచిత హామీలు గుప్పించకుండా రాజకీయ పార్టీలపై కొంత నియంత్రణ పెట్టేందుకు ఓ వ్యవస్థ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో సమాజంలో విస్తృతంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత్ వంటి పేద దేశంలో సమాజంలోని అట్టడుగు వర్గాలకు ప్రభుత్వమే కొన్ని కనీస సౌకర్యాలను కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఓటర్లపై ఉచిత హామీలు గుమ్మరిస్తున్నాయని ఆయన ఆరోపించారు. 
 
ప్రభుత్వం ఏర్పాటు చేశాక తామిచ్చిన ఉచిత హామీల అమలుకు అప్పులు చేస్తున్నాయని విమర్శించారు. ఇందుకోసం ఫిస్కల్ రెస్పాన్సిబిలిటి అండ్ బడ్జెట్ మేనేజ్ మెంట్ (ఎస్ఆర్ఎంబీ) పరిమితులను దాటేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలకు ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి అని ఆర్బీఐ మాజీ గవర్నర్ గుర్తుచేశారు. ఆర్థిక వృద్ధి రేటును ఏటా 7.6 శాతం కొనసాగించగలిగితే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఆయన చెప్పారు.