శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 17 అక్టోబరు 2024 (22:37 IST)

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

indian railway
ముందస్తు రైల్వే రిజర్వేషన్ సమయాన్ని 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గించడంపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. గడువు ఎక్కువగా ఉండటం వల్ల రిజర్వేషన్ టిక్కెట్లను రద్దు చేసుకునేవారి సంఖ్య అధికంగా ఉంటుందని దీనివల్ల అనేక బెర్తులు లేదా సీట్లు వృథా అవుతున్నాయని పేర్కొంది.  
 
రైల్వే రిజర్వేషన్ ముందస్తు బుకింగ్ గడువును రైల్వే శాఖ 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గిస్తూ ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. రైల్వే శాఖ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై సర్వత్రా విస్మయం వ్యక్తమైంది. దీనిపై రైల్వే బోర్డు వివరణ ఇచ్చింది. 
 
120 రోజుల గడువు ఉండటం వల్ల క్యాన్సలేషన్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇది ప్రస్తుతం 21 శాతంగా ఉంటోంది. 4-5 శాతం మంది ప్రయాణమే చేయడం లేదు. వారు టిక్కెట్ రద్దు చేసుకోకపోవడంతో సీట్లు, బెర్తులు తీసుకోవడం వంటి ఘటనలకు కారణమవుతోంది. ప్రస్తుతం నిర్ణయంతో వీటిని నిరోధించవచ్చు అని రైల్వే బోర్డు వెల్లడించింది. 
 
వీటితో పాటు గడువు ఎక్కువగా ఉండటం వల్ల కొంతమంది ముందస్తుగానే సీట్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉంటోందని తక్కువ గడువు ఉంటే నిజమైన ప్రయాణికులను అనువుగా ఉంటుందని తెలిపింది. తక్కువ క్యాన్సలేషన్లు, ప్రయాణికుల డిమాండ్ అధికంగా కనిపిస్తే అందుకు అనుగుణంగా ప్రత్యేక రైళ్ళను ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ వీలుంటుందని పేర్కొంది. 
 
ముందస్తు బుకింగ్‌ గడువులో కాలానుగుణంగా మార్పులు జరుగుతూనే ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. ఇది 30 రోజుల నుంచి 120 రోజుల వరకు ఉందని, వివిధ వ్యవధుల అనుభవాల ఆధారంగా 60 రోజుల గడువు ప్రయాణికులకు ప్రయోజనకంగా ఉంటుందని గుర్తించామని తెలిపింది. ఇందుకు సంబంధించి ఏప్రిల్ 1981 నుంచి 2015 వరకు అనేసార్లు మార్పులు చేసిన విషయాన్ని రైల్వే బోర్డు గుర్తుచేసింది.