శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 5 జులై 2024 (09:36 IST)

భూమిపై ఉండే మానవాళి - జీవరాశి అంతమైపోతుందా? ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏమంటున్నారు?

somanath
భూమిపై ఉండే జీవరాశి అంతమైపోతుందని ఇస్రో చీఫ్ సోమనాథ్ అంటున్నారు. ఆయన ఇలా వ్యాఖ్యానించడానికి కారణాలు లేకపోలేదు. గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే మాత్రం మానవాళితో పాటు భూమ్మీద ఉన్న అధిక శాతం జీవరాశి అంతమైపోతుందని హెచ్చరించారు. 
 
ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇస్రో ఓ వర్క్ షాపు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, 'మన జీవితకాలం 70 - 80 ఏళ్లే. కాబట్టి మనం ఇలాంటి విపత్తులను చూడకపోవచ్చు. దీంతో, గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేస్తాం. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తరచూ భూమిని గ్రహశకలాలు ఢీకొడుతుంటాయి. జూపిటర్ గ్రహాన్ని ఓ గ్రహశకలం ఢీకొట్టడాన్ని నేను కళ్లారా చూశాను. 
 
అలాంటిదే భూమ్మీద జరిగితే మనందరం అంతరించిపోతాం. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. పుడమి తల్లిని ఇలాంటి విపత్తు నుంచి రక్షించాలి. భూమివైపు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే మార్గం ఉంది. భూమికి సమీపంగా ఉన్న గ్రహశకలాలను ముందుగా గుర్తించి ప్రమాదం నివారించొచ్చు. అయితే, ఒక్కోసారి ఇలా చేయడం సాధ్యపడకపోవచ్చు. కాబట్టి, ఇందుకు అవసరమైన సాంకేతికతను అభివృద్ధి చేసుకోవాలి. భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి గ్రహశకలాలను భూమ్మీద పడకుండా దారి మళ్లించాలి. ఇందు కోసం ప్రపంచదేశాలు ఉమ్మడిగా వివిధ విధానాలు రూపొందించాలి' అని అన్నారు.
 
భవిష్యత్తులో ఈ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని అన్నారు. ప్రమాదం తప్పదన్న సమయంలో మానవాళి మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి ప్రమాద నివారణకు నడుం బిగిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ముందుడుగేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యత తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.