శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 29 జనవరి 2024 (09:51 IST)

కూలి పని చేసైనా భార్యకు భరణం చెల్లించాల్సిందే : అలహాబాద్ హైకోర్టు

court
ఉద్యోగం లేకపోయినా సరే కూలి పని చేసి అయినా భార్యకు భరణం చెల్లించాల్సిందేనని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. భార్య నుంచి విడాకులు తీసుకున్న భర్త.. నెలకు రూ.2 వేలు భరణం చెల్లించాలని ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. దీన్ని భర్త హైకోర్టులో సవాల్ చేశారు. ఇక్కడ కూడా ఆయనకు చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు.. కూలి పని చేసి అయినా సరే భార్యకు భరణం చెల్లించాల్సిందేనంటూ తీర్పునిచ్చింది. ప్రతి రోజూ కూలి పని చేస్తే రూ.350 నుంచి రూ.450 వరకు వస్తాయని హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
పట్టభద్రురాలైన తన భార్య ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుందని, ఆమె నెలకు రూ.10 వేలు సంపాదిస్తుందని, తాను అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నానని రివిజన్ పిటిషన్‌లో భర్త పేర్కొన్నారు. పైగా, ఈ విషయాన్ని కింది కోర్టు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. దీన్ని విచారించి అలహాబాద్ హైకోర్టు భార్య టీచరుగా పని చేస్తున్నట్టు రుజువులు చూపించాలని కోరింది. పిటిషనర్ ఆరోగ్యంగా ఉండటంతో డబ్బు సంపాదించే సామర్థ్యం ఉఁదని, అందువల్ల భార్యకు భరణం చెల్లించాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి రేణు అగర్వాల్ స్పష్టమైన తీర్పునిచ్చారు.