శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (11:17 IST)

ఉపాధ్యాయుల శిక్షణ కోసం బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టాలి: ఇన్ఫీ నారాయణ మూర్తి

info narayana murthy
పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో దేశ విదేశాల్లో రిటైర్డ్ టీచర్లతో శిక్షణ ఇప్పించాలని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ దిశగా దేశ వ్యాప్తంగా ట్రెయిన్ ది టీచర్ సెంటర్లను నెలకొల్పాలని ఆయన సలహా ఇచ్చారు. జాతీయ విద్యా విధానం లక్ష్యాల కోసం ఈ చర్యలు కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. 
 
ఇందుకోసం స్టెమ్ రంగాల్లో భారత్ అభివృద్ధి దిశగా టీచర్ల శిక్షణ కోసం ప్రభుత్వం భారీ ఖర్చు చేయాలని ఆయన కోరారు. భారత్ సహా వివిధ దేశాల్లో పదివేల మంది రిటైర్డ్ టీచర్‌తో ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులకు స్టెమ్ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు యేటా బిలియన్ డాలర్ల ఖర్చు చేయాలని సూచించారు. టీచర్లు, పరిశోధకులను గౌరవించుకోవాలని, వారికి మంచి జీతాలు వసతులు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యంతోనే తాము 2009లో ఇన్ఫోసిస్ ప్రైజ్ ఏర్పాటు చేశామన్నారు. 
 
జాతీయ విద్యా విధానం లక్ష్యాలను సాధించేందుకు టీచర్ల శిక్షణ ఎంతో కీలకమని నారాయణ మూర్తి అన్నారు. స్టెమ్ రంగాల్లో పాఠశాల టీచర్లకు రిటైర్డ్ టీచర్లతో శిక్షణకు దేశ వ్యాప్తంగా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. యేడాది పాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగాలని ఆయన బుధవారం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కార్యక్రమంలో సూచించారు. ఇలా సుశిక్షితులైన టీచర్లు మరింత మంది టీచర్లకు మార్గదర్శకంగా మారతారని ఆయన చెప్పుకొచ్చారు.