శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

తూర్పు నౌకాదళ కేంద్రం : ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక ప్రత్యేకతలేంటి?

ins nirdeshak
హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ఐఎన్ఎస్ నిర్దేశక్ పేరు రక్షణ నౌకను భారత రక్షణ శాఖ తయారు చేసింది. ఈ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జాతికి అంకితం చేయనున్నారు. బుధవారం విశాఖ నౌకాదళంలో జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొని ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను జాతికి అంకితం చేయనున్నారు.
 
ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌక‌ను కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) కంపెనీ నిర్మించింది. ఈ నౌక పొడవు 110 మీటర్లు... దీని బరువు 3,800 టన్నులు. దీంట్లో 2 ఇంజన్లు ఉంటాయి. అత్యాధునిక హైడ్రోగ్రాఫిక్, ఓషనోగ్రాఫిక్ సర్వే పరికరాలతో ఈ నౌకకు రూపకల్పన చేశారు. వీడ్కోలు తీసుకున్న నిర్దేశక్ నౌక స్థానంలో ఈ కొత్త ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను తయారు చేశారు. 
 
18 నాటికల్ మైళ్ల వేగంతో ఏకబిగిన 25 రోజుల పాటు ప్రయాణించడం ఈ నౌక ప్రత్యేకత. హిందూ మహాసముద్రంలో చైనా నుంచి ఎదురవుతున్న వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కోవడంలో ఐఎన్ఎస్ నిర్దేశక్ కీలకపాత్ర పోషించనుందని రక్షణ రంగ వర్గాలు భావిస్తున్నాయి.