కన్నడిగను అని చెప్పడానికి గర్వంగా ఉంది... ఎవరికీ సమాధానం చెప్పను.. కిరణ్ మజుందార్
ఏడు దశాబ్దాలుగా నా నగరాన్ని, నా కన్నడ సంస్కృతిని ప్రేమిస్తున్నాను... నేను కన్నడిగను అని చెప్పడానికి గర్వంగా ఉందని, బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా చెప్పారు. పైగా, తాను చేసిన ట్వీట్ లేదా తనపై సాగుతున్న ట్రోల్స్‌పై ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో రోడ్ల దుస్థితి, చెత్తపై బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా ఇటీవల చేసిన పోస్టులు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆమె తీరుపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేయగా.. నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. ఆమె నిజమైన కన్నడవాసి కాదంటూ పలువురు ట్రోల్ చేశారు. ఈ పరిణామాల వేళ తాజాగా ఆమె చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తాను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ కిరణ్ మజుందార్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు.
''నేను ఈ నగరంలోనే (బెంగళూరు) జన్మించాను. ఏడు దశాబ్దాలుగా నా నగరాన్ని, నా కన్నడ సంస్కృతిని ప్రేమిస్తున్నాను. ఈ అద్భుతమైన భాషను చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చు. కర్ణాటకపై నా విధేయతను ప్రశ్నించే ఎవరికైనా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. నేను కన్నడిగను అని చెప్పడానికి గర్వపడుతున్నా'' కిరణ్ మజుందార్ షా పోస్ట్ చేశారు. ఇక, బెంగళూరు రోడ్లకు మరమ్మతులు చేసేందుకు కిరణ్ మజుందార్ షా నిధులు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలను ఆమె కొట్టిపారేశారు.
కాగా, గత కొన్ని రోజులుగా బెంగుళూరు నగర రోడ్లపై చర్చ సాగుతోంది. ఈ క్రమంలో బయోకాన్ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని కిరణ్ మజుందార్ షా ఓ పోస్టులో వెల్లడించారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. దీనిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యంగ్యంగా బదులిచ్చారు.
ఆమె రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయొచ్చన్నారు. అందుకోసం నిధులు కూడా ఇస్తామన్నారు. వ్యక్తిగత అజెండాతోనే ఆమె ఈ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. అయితే, ఈ వివాదం వేళ కిరణ్ మజుందార్ షా మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో భేటీ అవడం ప్రాధాన్యం సంతరించుకుంది.