బుధవారం, 1 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 అక్టోబరు 2025 (11:17 IST)

కరూర్ తొక్కిసలాట: ఊపిరితిత్తుల్లో ఫ్రాక్చర్లు.. పక్కటెముకలు, వెన్నెముకలు విరిగిపోయాయి

Karur
Karur
తమిళనాడు కరూర్‌లో‌ చోటుచేసుకున్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడు వైద్యవిద్య, పరిశోధన విభాగ డైరెక్టర్‌ ఆర్‌.సుగంధి రాజకుమారి నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం ప్రమాదం జరిగిన కరూర్‌ను సందర్శించింది. 
 
ఈ సందర్భంగా చాలామంది కంప్రెస్సివ్‌ అస్ఫిక్సియాతో ఇబ్బందిపడి చనిపోయారని వైద్యులు బృందానికి తెలిపారు. ‘తొక్కిసలాట, తోపులాట తీవ్రంగా జరిగిందని ఫలితంగా ఛాతీభాగం బలంగా ఒత్తిడికి గురవడంతో ఊపిరితిత్తులు సంకోచ, వ్యాకోచాలకు కష్టమైందని వివరించారు. ఊపిరితిత్తులపై ఒత్తిడి కారణంగా గాలి లోపలికి ప్రవేశించలేకపోయింది. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఎంతటి క్లిష్టపరిస్థితుల్లోనైనా 2, 3 నిమిషాలకు మించి బతికే అవకాశం లేదు. చిన్న పిల్లలైతే 30సెకన్లలోనే ప్రభావానికి గురవుతారు’ అని వైద్యులు తెలిపారు. చనిపోయిన కొందరి ఊపరితిత్తుల్ని స్కాన్‌ చేసినపుడు పగుళ్లు(ఫ్రాక్చర్స్‌) కనిపించాయని, తద్వారా తొక్కిసలాట ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వైద్యులు వివరించారు. 
 
అత్యధికుల్లో పక్కటెముకలు, వెన్నెముకలు విరిగినట్లు గుర్తించారు. అంత తీవ్రంగా తొక్కిసలాట జరిగి ఉంటుందని, తీవ్రమైన నొప్పిని వారు భరించి ఉంటారని చెబుతున్నారు. ఇప్పటిదాకా 41మంది మృతి చెందినట్లుప్రకటించారు. ఘటన జరిగిన 27వ తేదీ రాత్రి కరూర్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల ఆసుపత్రికి తీసుకువచ్చిన వారిలో 39మంది మార్గమధ్యంలోనే మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు.