మంగళవారం, 11 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 మే 2023 (18:05 IST)

ది కేరళ స్టోరీ వివాదంపై శశిథరూర్ స్పందన.. ‘అది మా స్టోరీ కాదు’..

shasi tharoor
కేరళ రాష్ట్రంలో 'ది కేరళ స్టోరీ' వివాదం సాగుతోంది. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రంపై పలు వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ఈ చిత్రంపై స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. 'ఇది మీ కేరళ కథ కావొచ్చు. మా కేరళ కథ మాత్రం కాదు' అంటూ చిత్ర నిర్మాతలను ఉద్దేశించి ఘాటుగా స్పందించారు. 
 
కేరళలో కొన్నేళ్లుగా '32 వేల మంది' మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలకు సంబంధించి వారి ఆచూకీ ఎక్కడనే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ ఆరోపణలపై కేరళ స్టేట్‌ కమిటీ ఆఫ్‌ ముస్లిం యూత్ లీగ్ సవాలు విసిరింది. 
 
ఈ సినిమాలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించిన వ్యక్తికి రూ.కోటి ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ సవాలు గురించి శశిథరూర్‌ కూడా ట్విటర్‌లో పోస్టు పెట్టారు. అలాగే NotOurKeralaStory అనే హ్యాష్‌ ట్యాగ్‌ను షేర్ చేశారు. 
 
మరోవైపు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే దుష్ప్రచారానికి ఉపక్రమిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.