1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 మే 2025 (13:11 IST)

నదిలో శవమై కనిపించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత!!

subbanna ayyappan
ప్రముఖ వ్యవసాయ, జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ (70) నదిలో శవమై కనిపించారు. కర్నాటకలోని శ్రీరంగపట్నం సమీపంలోని కావేరీ నదిలోఆయన మృతదేహాన్ని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.
 
వివరాలను పరిశీలిస్తే, మైసూరు విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివాసం ఉంటున్న అయ్పప్పన్ ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు విద్యారణ్యపురం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విచారణలో అయ్యప్పన్ ప్రతి రోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్లేవారని తెలిసింది. కావేరీ నది తీరాన ఆయన ద్విచక్రవాహనం నిలిపివుండటంతో ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానించి నదిలో గాలించగా, ఆయన మృతదేహం లభ్యమైంది. 
 
కాగా, డాక్టర్ అయ్యప్పన్ భారతదేశంలోని నీలి విప్లవం విస్తరణకు విశేష కృషి చేశారు. పంటల విభాగేతర శాస్త్రవేత్త ఐకార్ డైరక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలి వ్యక్తి ఆయనే కావడం గమనార్హం. దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయన మృతికి గల ఖచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.