బుధవారం, 26 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 నవంబరు 2025 (14:08 IST)

బాల రాముడి ఆలయ శిఖరంపై జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ

narendra modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం బాలరాముడు కొలువైవున్న అయోధ్యా నగరంలో పర్యటించారు. ఈ సందర్భంగా బాల రాముడి ఆలయ శిఖరంపై జండాను ఆయన ఆవిష్కరించారు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమం మంగళవారం కన్నులపండుగగా జరిగింది. ఈ సందర్భంగా జైశ్రీరామ్‌ నినాదంతో ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. అయోధ్య నగరంలో ధ్వజారోహణ కార్యక్రమంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయని వ్యాఖ్యానించారు. అలాగే, భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందన్నారు.
 
'రామభక్తుల సంకల్పం సిద్ధించింది. కోట్లాది మంది కల సాకారమైంది. శతాబ్దాల నాటి గాయాలు, బాధల నుంచి నేడు ఉపశమనం లభించింది. 500 ఏళ్లుగా ఉన్న సమస్య పరిష్కారమైంది. ఈ ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తున్నా. రామాలయ నిర్మాణ యజ్ఞానికి నేడు పూర్ణాహుతి జరిగింది. ధర్మధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం. సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం ప్రతీక. శ్రీరాముడి సిద్ధాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుంది. స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుంది. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెబుతుంది' అని మోడీ పేర్కొన్నారు. 
 
'పేదలు, దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నాం. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అయోధ్య చెబుతుంది. రాముడు కులం చూడడు.. కేవలం భక్తి మాత్రమే చూస్తాడు. ధర్మధ్వజంపై కోవిదార్‌ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది' అని ప్రధాని తెలిపారు. 
 
'మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని వారు అంటున్నారు. అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు. భారత్‌లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడు. ప్రజాస్వామ్యానికి భారత్‌ పుట్టినిల్లు. ఇది మన డీఎన్‌ఏలోనే ఉంది. శతాబ్దాల క్రితమే భారత్‌లో ప్రజాస్వామ్య విధానం ఉంది. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోంది. వచ్చే వెయ్యేళ్లు భారత్‌ తన శక్తిని ప్రపంచానికి చాటాలి. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది' అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.