శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 3 అక్టోబరు 2024 (21:58 IST)

రైల్వే ఉద్యోగులకు ముందుగానే దీపావళి : 78 రోజుల బోనస్ ప్రకటించిన కేంద్రం

indian railway
దేశంలోని రైల్వే ఉద్యోగులకు నెల రోజులు ముందుగానే దీపావళి వచ్చింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్‌ను కేంద్రం ప్రకటించింది. ఇందుకోసం కేంద్రం రూ.2028.57 కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖామంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత గురువారం కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రైల్వే ఉద్యోగులకు బోనస్‌ ప్రకటించడంతో పాటు 'నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబిల్‌ ఆయిల్‌ - ఆయిల్‌ సీడ్స్‌'కు ఆమోదం తెలిపింది. దేశంలో మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు ఆమోద ముద్ర వేసింది. దీంతో మరాఠీ, పాళి, ప్రాకృతం, అస్సామీ, బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా దక్కనుంది. ఇప్పటికే తెలుగు సహా ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉన్న విషయం తెలిసిందే. 
 
మరోవైపు, పండగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్‌ చెల్లించేందుకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 11.72 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు 78 రోజుల ఉత్పాదక అనుసంధానిత బోనస్‌గా రూ.2028.57 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. 
 
అలాగే, చెన్నై మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో దశకు ఆమోద కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు  ట్రాఫిక్‌ను సులభతరం చేయడంతో పాటు ఆర్థిక వృద్ధిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఫేజ్‌-2లో భాగంగా రూ.63,246 కోట్లతో 119కి.మీల మేర ఈ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కింద మూడు కారిడార్లుగా మొత్తం 120 స్టేషన్లు నిర్మించనున్నారు. 
 
వంట నూనెలు దేశ వార్షిక అవసరాల్లో 50 శాతానికి పైగా భారత్‌ దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంట్లో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2022-23 నాటికి 39 మిలియన్‌ టన్నుల నూనెగింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా.. 2030-31 నాటికి 69.7 మిలియన్‌ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, సాగును అదనంగా 40 లక్షల హెక్టార్లు పెంచేందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.