Rats Bite: ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు.. ఇద్దరు శిశువుల మృతి.. ఎలా? (video)
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోరం జరిగింది. ఎలుకలు పసిప్రాణాలను బలిగొన్నాయి. ఇండోర్‌లో ఉన్న పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి మహారాజా యశ్వంత్ రావ్ హాస్పిటల్‌లో ఈ ఘోరం జరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలో రెండు నెలల శిశువు, ఒక నవజాత శిశువు ఎలుకల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
సెప్టెంబర్ 1వ తేదీ రెండు నెలల శిశువుని పీడియాట్రిక్ సర్జరీ వార్డులో చేర్చారు. ఆ శిశువు వెన్నుముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. రాత్రి సమయంలో డ్యూటీలో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, ఎలుకలు శిశువు చేతి వేళ్లను కొరికాయి. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
అయితే, అప్పటికే శిశువు పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు మృతి చెందింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే, సెప్టెంబర్ 2న, అదే ఆసుపత్రిలోని నవజాత శిశువుల వార్డులో మరో దారుణం చోటుచేసుకుంది.
పుట్టిన కొన్ని గంటలకే ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉంచిన ఓ పసికందుని ఎలుకలు కరిచి చంపేశాయి. ఈ ఘటనలపై ఆందోళన చెంది, కన్నీటి పర్యంతమైన తల్లిదండ్రులు నిరసనలకు దిగారు.