శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 21 మే 2024 (11:42 IST)

తప్పు చేయనపుడు భయపడొద్దు.. స్వదేశానికి వచ్చెయ్.. ప్రజ్వల్‌కు వినతి

jds kumaraswamy
కర్నాటక రాష్ట్రంలో ఇటీవల వెలుగు చూసిన లైంగిక దౌర్జన్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రజ్వల్ బాబాయ్ హెచ్.డి.కుమార స్వామి ఓ విజ్ఞప్తి చేశారు. ఏ తప్పూ చేయనపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని అందువల్ల స్వదేశానికి తిరిగి రావాలని ఆయన సూచించారు. ఏ తప్పూ చేయనట్టయితే భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని, ధైర్యంగా విచారణ ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా ద్వారా ఆయన పిలుపునిచ్చారు. 
 
సెక్స్ స్కాండల్ కేసులో ఆరోపణలు తమ కుటుంబ మర్యాదలకు మచ్చగా మారాయని చెప్పారు. ప్రజ్వల్‌కు విదేశాలకు వెళ్లడం ఈ ఆరోపణలకు మరింత బలం చేకూర్చిందని తెలిపారు. ఈ క్రమంలో ఇండియాకు తిరిగొచ్చి, ధైర్యంగా విచారణను ఎదుర్కోవాలని ప్రజ్వల్‌కు సూచించారు. కుటుంబ పరువు మర్యాదలను కాపాడాలని సోదరుడి కుమారుడికి చెప్పారు. 
 
కర్నాటకకు కుదిపేసిన సెక్స్ స్కాండల్‌ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని, వారిపై అఘాయిత్యం చేస్తూ వీడియోలు చిత్రీకరించాడని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికలకు ముందు పలువురు మహిళలతో ప్రజ్వల్ సన్నిహితంగా ఉన్న వీడియోల పెన్ డ్రైవ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. 
 
ఇందులో పలువురు మహిళలతో ప్రజ్వల్ రేవణ్ణ సన్నిహితంగా ఉన్న దాదాపు 3 వేల వీడియోలు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఈ ఘటన తర్వాత నాలుగు రోజులకు ప్రజ్వల్ తన డిప్లమాటిక్ పాస్ పోర్టు సాయంతో జర్మనీ వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లకి కూడా చెప్పకుండా దేశం సరిహద్దులు దాటడంతో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.