సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 నవంబరు 2024 (14:01 IST)

రణరంగంగా జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ... ఎమ్మెల్యేల బాహాబాహీ (Video)

jk assembly
జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేలా ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే, ఇదే అంశంపై బారాముల్లా లోక్‌సభ ఎంపీ ఇంజనీర్ రషీద్ సోదరుడు ఖుర్షీద్ అహ్మద్ షేక్ అసెంబ్లీలో బ్యానర్ ప్రదర్శించారు. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రద్దు చేసిన ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరించేందుకు వీలులేదంటూ నినాదాలు చేశారు. దీంతో అధికార ఎన్సీపీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇది తీవ్ర స్థాయికి చేరుకోవడంతో ఇరు పక్షాల ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అసెంబ్లీ సమావేశమందిరి రణరంగాన్ని తలపించింది. 
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ, కాంగ్రెస్, పీడీపీలు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో ఆరేళ్ల తర్వాత ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజైన గురువారం అసెంబ్లీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలంటూ బుధవారం సభలో అధికారపక్ష సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. 
 
గురువారం సభప్రారంభంకాగానే పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) సభ్యులు ఆర్టికల్ 370, 35(ఏ)ని పునరుద్ధరించాలంటూ తీర్మానాన్ని ప్రతిపాదించింది. బీజేపీ సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సునీల్ శర్మ ఈ తీర్మానంపై మాట్లాడుతుండగా.. అవామీ ఇత్తెహాద్ పార్టీ ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్ వెల్లోకి దూకి బ్యానర్ ప్రదర్శించారు. 
 
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ సభ్యులు ఆ బ్యానర్‌ను లాక్కుని చింపి పడేశారు. దీంతో స్పీకర్ అబ్దుల్ రహీం రాథెర్ సభను వాయిదా వేశారు. బుధవారం కూడా అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించగానే స్థానిక పార్టీలు ప్రశంసించాయి. అయితే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం దీనిని వ్యతిరేకించింది. దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.