దేశ వ్యాప్తంగా స్వల్పంగా పెరిగిన రైలు చార్జీలు...
రైలు ప్రయాణికులపై కేంద్రం స్వల్పంగా భారం మోపింది. దేశ వ్యాప్తంగా పెంచిన రైలు చార్జీలు మంగళవారం అమల్లోకి వచ్చాయి. అంటే సోమవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. అలాగే, టికెట్ బుకింగ్ కీలక నిబంధనలను కూడా అమలు చేస్తున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జోన్ల మేనేజర్లకు ఆదేశాలతో కూడిన సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం జులై 1వ తేదీ నుంచి కొత్త ఛార్జీలు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
రైల్వే శాఖ తాజా నిర్ణయంతో వివిధ తరగతుల్లో టికెట్ ధరలు పెరగనున్నాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్, రైళ్లలో నాన్-ఏసీ ప్రయాణానికి సంబంధించి సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు ఒక పైసా చొప్పున పెంచారు. అదేవిధంగా, అన్ని రకాల రైళ్లలోని ఏసీ తరగతుల్లో (ఏసీ చైర్ కార్, ఏసీ 3-టైర్, 2-టైర్, ఫస్ట్ క్లాస్) ప్రయాణానికి కిలోమీటరుకు రెండు పైసల చొప్పున ఛార్జీని పెంచుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఆర్డినరీ రైళ్లలోని స్లీపర్, ఫస్ట్ క్లాస్ టికెట్లపై కిలోమీటరుకు అర పైసా చొప్పున ధర పెరగనుంది.
అయితే, ఆర్డినరీ సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి పాక్షిక ఉపశమనం కల్పించారు. 500 కిలోమీటర్ల వరకు పాత ఛార్జీలనే కొనసాగించనున్నారు. 501 నుంచి 1,500 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తే టికెట్‌పై రూ.5, 2001 నుంచి 2500 కిలోమీటర్లకు రూ.10, 2501 నుంచి 3000 కిలోమీటర్ల వరకు రూ.15 అదనంగా వసూలు చేయనున్నారు.
ఇకపోతే, ఛార్జీల పెంపుతో పాటు తత్కాల్ టికెట్ల బుకింగ్ విధానంలో రైల్వే శాఖ కీలక మార్పు చేసింది. జులై 1 నుంచి తత్కాల్ కోటాలో టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డును తప్పనిసరి చేసింది. ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచించింది.