సోమవారం, 29 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 28 సెప్టెంబరు 2025 (11:12 IST)

కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్.... నివేదిక కోరిన హోం శాఖ

amit shah
తమిళనాడు రాష్ట్రంలోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన రాజకీయ బహిరంగ సభలో జరిగిన ఈ తొక్కిసలాట దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్రం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 
 
కరూర్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి విజయ్ తన టీవీకే పార్టీ తరపున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయిన సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఊపిరాడక, కిందపడిపోయి జనం కాళ్ల కింద నలిగిపోవడంతో 39 మంది చనిపోగా, మరో 60 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి తీవ్రంగా ఉంది. 
 
క్షతగాత్రులను కరూర్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఆసుపత్రి ప్రాంగణం బాధితులు, వారి బంధువులు ఆర్తనాదాలతో యుద్ధ వాతావరణాన్ని తలపించిందని స్థానిక అధికారులు పేర్కొన్నారు. అదనపు డీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ దేవశిర్వతం సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
 
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే.స్టాలిన్ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. బాధితులను పరామర్శించేందుకు, భవిష్యత్ కార్యక్రమాలకు భద్రతా ఏర్పాట్లను సమీక్షించేందుకు సీఎం స్టాలిన్‌కు కరూర్‌కు శనివారం రాత్రే చేరుకున్నారు.