శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 జులై 2024 (17:35 IST)

ఢిల్లీ - వారణాసి వందే భారత్‌ రైలులో నీటి లీకేజీ... Video Viral

water leakage
దేశంలో మంచి ఆదరణ చూరగొన్న వంద భారత్ రైళ్ల తయారీలో ఉన్న లోపాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గతంలో కేవలం ఆవును ఢీకొట్టగా ఇంజిన్ ముందు భాగంలో ఉండే డోమ్ ఊడిపోయింది. ఇలాంటి సంఘటనలు పలు చోటుచేసుకున్నాయి. ఇపుడు ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలు పై కప్పు నుంచి నీరు లీక్ అయింది. దీంతో కొన్ని సీట్లు తడిసిముద్దయ్యాయి. ఈ సంఘటనపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
22416 అనే నంబరుతో ఢిల్లీ - వారణాసి ప్రాంతాల మధ్య నడిచే వందే భారత్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు కూర్చొన్న సీటు పైన రూఫ్ నుంచి నీరు ధారగా కారింది. దీనివల్ల కింద ఉన్న కొన్ని సీట్లు కూడా తడిసిపోయాయి. దీన్ని చూసిన తోటి ప్రయాణికులంతా అవాక్కయ్యారు. రైలు రూఫ్ నుంచి నీరు కారుతున్న దృశ్యాన్ని ఆ మహిళా ప్రయాణికురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. 
 
ఆ వీడియోలో ఆ మహిళ మీ కాలేజీలో అందరికీ చెప్పు. ఇక ఎవరూ ప్రయాణించకూడదు అంటూ మాట్లాడటం వినిపిస్తుంది. తాను పోస్ట్ చేసిున వీడియోను జతగా ఆమె ఓ క్యాప్షన్‌ను జత చేశారు. వందే భారత్ దుస్థితి చూడండి. ఈ రైలు ఢిల్లీ - వారణాసి మార్గంలో నడుస్తుంది అని క్యాప్షన్ జోడించారు. ఈ నెల 2వ తేదీన ఆ వీడియోను ఆమె పోస్ట్ చేయగా దానికి 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. 
 
మరోవైపు. రైల్వే శాఖ దీనిపై స్పందించింది. ఏసీ పైపుల్లో తాత్కాలికంగా అడ్డంకి ఏర్పడటంతో స్వల్ప లీకేజీ సంభవించింది. ఈ విషయం తెలిసిన వెంటనే సిబ్బంది దాని సరిచేశారు. అయినా ప్రయాణికురాలికి కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం అంటూ ఉత్తర రైల్వే పేర్కొంది.