ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు వచ్చి చివరకు అతడి చేతిలోనే శవమైంది...
తాను ప్రేమించిన వ్యక్తి కోసం 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన ప్రియురాలు చివరకు తన ప్రియుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయింది. ముఖపుస్తకంలో మొదలైన వారి పరిచయం పెళ్లిప్రస్తావన తేవడంతో విషాదాంతంగా ముగిసింది. ఈ దారుణ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోన బర్మార్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివవరాను పరిశీలిస్తే,
ఝున్ ఝునుకు చెందిన ముకేశ్ కుమారి (37) అంగన్వాడీ సూపర్ వైజర్‌గా పనిచేస్తూ భర్తతో విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో బర్మార్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు మనరామ్ ఆమెకు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇప్పటికే వివాహితుడైన మనరామ్, తన భార్యతో మనస్పర్థల కారణంగా విడాకుల కోసం కోర్టులో కేసు నడుపుతున్నాడు.
కొంతకాలానికి వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని ముకేశ్ కుమారి గత కొంతకాలంగా మనరామ్‌పై ఒత్తిడి తెస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 10న, మనరామ్‌ను కలిసేందుకు ఆమె తన కారులో ఝున్ ఝును నుంచి బర్మార్‌కు బయలుదేరింది. నేరుగా అతడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో తన ప్రేమ వ్యవహారాన్ని చెప్పింది.
అదే రోజు సాయంత్రం, మాట్లాడదామని చెప్పి ముకేశ్‌ను మనరామ్ కారులో బయటకు తీసుకెళ్లాడు. మార్గమధ్యంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహానికిలోనైన మనరామ్, కారులో ఉన్న ఇనుప రాడ్డుతో ఆమె తలపై బలంగా కొట్టడంతో ముకేశ్ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.