గురువారం, 2 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. నాటి వెండి కెరటాలు
Last Updated : గురువారం, 25 సెప్టెంబరు 2025 (17:22 IST)

NTR: దుష్ట పాత్రలు సాత్విక పాత్రల ధూళిపాళ కు అదృష్టం జి.వరలక్ష్మి

Dhulipalla, ntr
Dhulipalla, ntr
ధూళిపాళ అంటే మనకు గుర్తొచ్చే పాత్ర శకుని పాత్ర. అంతకు ముందు సి.ఎస్.ఆర్ & లింగమూర్తి గార్లు అసమానంగా పోషించిన శకుని పాత్ర కు ధూళిపాళ మరిపించేవారు. అలాంటి ఆయన పూర్తిపేరు ధూళిపాళ సీతారామశాస్త్రి. సెప్టెంబర్ 24న ఆయన జయంతి. ఈ సందర్భంగా డాక్టర్. కె.వి.ఎస్. ప్రసాద్ రాసిన వ్యాసం గురించి ఒకసారి తెలుసుకుందాం.
 
మద్రాసు పచ్చయ్యప్ప కళాశాల ఆడిటోరియం లో ప్రదర్శిస్తున్న రోషనార నాటకంలో రామసింహుడి పాత్ర వేసిన నటుడు అప్పటికే అగ్రశ్రేణి నటీమణి గా వెలుగొందుతున్న జి.వరలక్ష్మి ని బాగా ఆకర్షించాడు. జి.వరలక్ష్మి ఆ నాటకాల న్యాయ నిర్ణేతలలో ఒకరు.
 
ఏదొచ్చినా పట్టలేం ఆవిడను. ఆగ్రహం వచ్చినా...అనుగ్రహం వచ్చినా! ఫైర్ బ్రాండ్. నాటకం ముగిసిన వెంటనే గ్రీన్ రూం లో కలిసి...శభాష్...బాగా చేశారు. మీ డైలాగ్  డెలివరీ...హావ భావాలు అద్భుతంగా ఉన్నాయి. నీవంటి నటుడి అవసరం తెలుగు సినిమాకు అత్యవసరం అంటూ ప్రక్కనే ఉన్న దర్శకుడు బి.ఎ. సుబ్బారావు కు పరిచయం చేశారు. ఆయన తన భీష్మ చిత్రం లో ధుర్యోధనుని వేషం ఇచ్చారు. 
 
నాటక రంగం లో అత్యద్భుతంగా వెలిగిపోతున్న ఆ వ్యక్తికి అదృష్టం జి.వరలక్ష్మి రూపంలో వచ్చింది. తమిళ పత్రికలు సైతం ఆయనను ‘నడిప్పిళ్‌ పులి నడత్తళ్‌ పసువు’ అని అభివర్ణించారు. అంటే... నటనలో పులి...నడతలో (నిజజీవితంలో) గోవు అని అర్ధం.
 
ధూళిపాళ గారు శ్రీకృష్ణ పాండవీయం లో  తన ప్రత్యేక తరహా నటనతో వాచకం తో అత్యద్భుతం గా చేశారు. కానీ నాటక రంగం లో మాత్రం...ధుర్యోధన & కీచక పాత్రలకు పెట్టింది పేరాయన.
 
ధూళిపాళగా పిలవబడే ధూళిపాళ సీతారామశాస్త్రి గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1922 సెప్టెంబర్ 24 న జన్మిచాడు. చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు.  బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు.
 
భీష్మ లో ఆయన నటన భీష్ముడిగా నటించిన ఎన్.టి.ఆర్. ను ఆకట్టుకుంది. ఆ తరువాత మహామంత్రి తిమ్మరుసు (1962),నర్తనశాల (1963)శ్రీ,కృష్ణార్జున యుద్ధం (1963), (గయుడు)బొబ్బిలి యుద్ధం (1964) (నరసరాయలు),మైరావణ (1964) వీరాభిమన్యు (1965) (ధర్మ రాజు) శివరాత్రి మహత్యం (1965) (విక్రముడు), శ్రీకృష్ణ పాండవీయం (1966) (శకుని)....ఇలా మంచి పాత్రలు వరించాయి.
 
గయుడిగా...శ్రీ కృష్ణార్జున యుధ్ధం లో మరపురాని నటన కనబరిస్తే.... యయాతి గా శ్రీరామాంజనేయ యుధ్ధం లో ప్రశస్తంగా నటించారాయన. నవరసాలు...అవలీలగా కంటి చూపులో పలికించగల ప్రజ్ఞా పాటవాలు ధూళిపాళ గారివి.
 
దుష్ట పాత్రలు...సాత్విక మైన పాత్రలు...హాస్య పాత్రలు(అంతా మన మంచికే)....ఇలా ఏపాత్రైనా కొట్టిన పిండే ప్రజ్ఞ గల ఆయనకు. అన్న గారి మది వెన్నెల తునక  తమ్ముని మనసే మీగడ తరక  మరదలి మమత మరువపు మొలక మరి ఏల కలిగెను ఈ కలత...ఈ కలత బాంధవ్యాలు (1968) లోని ఈ పాట గుండెను తాకుతుంది.
 
ఎస్.వి.రంగారావంటి నటుడు...తన సొంత సినిమా డైరెక్ట్ చేస్తూ... ఎంతో సాత్వికమైన తమ్ముడి పాత్ర...అదీ సావిత్రి సరసన ధూళిపాళ ను తీసుకున్నారు. అగ్రశ్రేణి నటీనటులకే తెలుస్తుంది...ఎవరు ఉత్తమ నటులని. బాంధవ్యాలు లో అత్యుత్తమ నటన చూపారు. ఇక ఎన్నో మంచి పాత్రలకు జీవం పోశారాయన  తెరమీద. తెలుగు లోనే గాక...తమిళ రంగాన కూడా ప్రసిధ్ధుడు.
 
దాన వీర శూర కర్ణ లో మళ్ళీ ఓ సారి శకుని పాత్ర ధరించి మెప్పు పొందారు. తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించిన నటుడు ధూళిపాళ గారు. బాంధవ్యాలు చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డు పొందారు. మహేష్ బాబు....మురారి ఆయన నటించిన చివరి చిత్రం. ఇద్దరు మగ పిల్లలు...ముగ్గురు ఆడపిల్లలు ఆయనకు.
 
నటరాజ సేవలో తరించిన ధూళిపాళ చనిపోవడానికి సుమారు పదేళ్ల క్రితం సినీ జీవితానికి స్వస్తి చెప్పి ఆధ్యాత్మిక జీవితానికి తెర తీశారు. పుట్టిన జీవి ఎప్పటికైనా గిట్టక తప్పదని, అయితే మానవ జన్మ విశిష్టత, మోక్షసాధన అవసరాన్ని తెలుసుకుని తరించాలని భావించి మానవసేవే లక్ష్యంగా సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక పథంలోకి అడుగుపెట్టారు. తనకున్న సంపదను త్యజించారు. 
 
2001 మే 7న కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ద్వారా ఆయన సన్యాస దీక్ష స్వీకరించారు. అప్పటి నుంచి శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతి పేరుతో వ్యవహారంలో ఉన్నారు. 
 
గుంటూరు మారుతీ నగర్‌లో మారుతీ దేవాలయాన్ని నిర్మించి, రామాయణం, సుందరకాండలను తెలుగు లోకి తిరిగి వ్రాశారు. ధూళిపాళ ట్రస్టును ఏర్పాటుచేసి సేవా కార్యక్రమాలు చేస్తూ, ధూళిపాళ కళావాహిని స్థాపించి కళారంగాన్ని ప్రోత్సహించారు. 
 
మూడున్నర దశాబ్దాల పాటు కళామతల్లికి సేవలందించి, శేషజీవితాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడిపారు ధూళిపాళ. ధూళిపాళ కొద్దికాలం ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడి 2007 ఏప్రిల్ 13 న మరణించారు. కానీ ఆయన చిత్రాల ద్వారా శాశ్వతత్వం పొందారు.
 ఎప్పుడు శ్రీకృష్ణ పాండవీయం చూచినా...దానవీర శూర కర్ణ చూచినా...శకుని పాత్రలో ధూళిపాళ పలకరిస్తూనే ఉంటారు.