శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 నవంబరు 2024 (19:41 IST)

హనుమంతుడి వడమాలకు.. రాహువుకు, శనికి ఏంటి సంబంధం?.. జిలేబి?

Hanuman Vadamala
Hanuman Vadamala
హనుమంతుడికి శనివారం వడమాలను సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పసివాడుగా ఉన్న హనుమంతుడు కనిపించిన ప్రతిదానిని తినాలనుకుంటాడు. ఆకలిగా ఉన్న సమయంలో ఎర్రగా కనిపిస్తున్న సూర్యుని చూసి పండుగా భ్రమిస్తాడు. 
 
ఆకాశంలోకి ఎగిరి ఆ ఎర్రటి పండు అందుకోవాలనే కుతూహలంతో వేగంగా వెళుతంటాడు. మరోవైపు గ్రహణ కాలం సమీపిస్తుండటంతో రాహువు సైతం సూర్యుడికి అడ్డుగా వస్తుంటాడు. అప్పటికే ఆకలి మంట మీద ఉన్న హనుమంతుడు తన త్రోవకు అడ్డువచ్చిన రాహువును ఒక్క తన్ను తన్ని పక్కకు పంపేస్తాడు.
 
రాహువుకు జరిగిన అవమానం తెలుసుకున్న ఇంద్రుడు ఆవేశంతో రగిలిపోయి తన ఆయుధాన్ని సంధిస్తాడు. అది ఆంజనేయుని దవడకు తగులుతుంది. దవడను హను అని సంభోదిస్తారు కాబట్టి అప్పటి నుంచే ఆయనకు హనుమంతుడు అని పేరు వచ్చింది. 
 
అలా వాయుపుత్రుడైన హనుమంతునికి గాయం కావడంతో వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. సమస్త లోకాల్లో పవనాలు వీచడాన్ని ఆపేస్తాడు. దాంతో దేవతలంతా దిగివచ్చి వాయుదేవుడ్ని శాంతింప జేసేందుకు ఆంజనేయుడికి తమ వద్దనున్న వరాలను ప్రసాదిస్తారు. 
 
ఆ సమయంలో రాహువు సైతం వరమిచ్చి హనుమంతుని ఆరాధించేందుకు వచ్చిన వారు మినుములతో చేసిన వడలు నైవేద్యంగా పెడితే వారి రాహుదోషాలను తొలగిపోతాయని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఇంకా 108 అనే సంఖ్యకు ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి 108 వడలతో వడమాలను ఆంజనేయుడికి నైవేద్యంగా సమర్పిస్తారు.
 
ఉత్తర భారతదేశంలో మాత్రం హనుమంతుడిని ఆరాధించేందుకు వచ్చిన వారు రాహువును కూడా ప్రసన్నం చేసుకునేందుకు జిలేబి సమర్పిస్తుంటారు. దక్షిణ భారతదేశంలో మాత్రమే మినుములు, ఉప్పు, మిరియాలు కలిసిన వడలతో నైవేద్యం సమర్పిస్తుంటారు.
 
కేవలం రాహు దోషమే కాదు శని దోషం ఉన్న వారు కూడా హనుమంతుడికి వడలను నైవేద్యంగా సమర్పిస్తే శనిదోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.