శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 సెప్టెంబరు 2024 (13:08 IST)

తెలంగాణాలో భారీ వర్షాలు : 15 మంది మృత్యువాత

rain
తెలంగాణ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశానికి చిల్లుపడిందా అన్న రీతిలో ఈ కుంభవృష్టి కురుస్తుంది. ఈ భారీ వర్షాలకు ఏకంగా 15 మంది చనిపోయారు. ఈ మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. మరో ఐదుగురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. 
 
ఒక్క ఖమ్మం జిల్లాలోనే 100కుపైగా గ్రామాలు వరదలో చిక్కుకున్నాయి. మున్నేరు పోటెత్తడంతో ఖమ్మంలో 10 అడుగుల మేర వరద ముంచెత్తింది. నల్గొండ జిల్లా కోదాడలో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రెండుచోట్ల, సూర్యాపేటలో ఒకచోట రైల్వే ట్రాక్ కోతకు గురికావడంతో రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ మార్గంలో 24 రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.
 
నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు మూడుచోట్ల గండ్లు పడ్డాయి. భక్త రామదాసు పంపుహౌస్ మునిగిపోయింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పలు చోట్ల వరదనీరు చేరడంతో కిలోమీటర్లకు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కోదాడలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. రంగారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు ఈసా, మూసీ వాగుల పొంగిపొర్లుతున్నాయి.
 
సబ్ స్టేషనులోలోకి నీరు చేరడం, చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేల కూలడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సింగరేణి వ్యాప్తంగా 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. రాష్ట్రవ్యాప్తంగా 218 రూట్లలో ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
 
గత మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇరు రాష్ట్రాల్లో ఒక పక్క భారీ వర్షాలు.. మరోవైపు పలు చోట్ల రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్న నేపథ్యంలో 21 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది. ఈ మేరకు దక్షిణ రైల్వే కీలక ప్రకటన చేసింది. 
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాల కారణంగా ఇవాళ (సోమవారం) రద్దైన 21 రైళ్ల జాబితాలో కాకినాడ పోర్ట్-లింగంపల్లి, సికింద్రాబాద్ - గూడూరు, బీదర్-మచిలీపట్నం, మచీలిపట్నం-బీదర్, విజయవాడ-సికింద్రాబాద్, విశాఖపట్నం-సికింద్రాబాద్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ, న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్తో పాటు పలు రైళ్లు ఉన్నాయి.
 
ఇక దారి మళ్లించిన 12 రైళ్ల జాబితాలో 12763 తిరుపతి- సికింద్రాబాద్, 22352 ఎస్ఎంవీటీ బెంగళూరు-పార్టీపుత్ర, 22674 మన్నార్గుడి-భగత్ కి కోతీ, 20805 విశాఖపట్నం-న్యూఢిల్లీ, విశాఖపట్నం-ముంబై, బీదర్- మధురైతో పాటు పలు రైళ్లు ఉన్నాయి. కాగా ప్రయాణీకులకు అదనపు సమాచారం కోసం రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను కూడా ఏర్పాటు చేసింది. హైదరాబాద్-27781500, వరంగల్-2782751, కాజీపేట-27782660, ఖమ్మం - 2782885 నంబర్లను సంప్రదించవచ్చునని సూచించింది.