శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 31 జనవరి 2024 (11:34 IST)

కూపీలాగేకొద్దీ బయటపడుతున్న అవినీతి అనకొండ అక్రమాలు

cash seized
తెలంగాణ రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో అరెస్టు అయిన హెచ్ఎండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమార్జనపై కూపీలాగే కొద్దీ అతని అవినీతి బయటపడుతుంది. దీంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, ఈ అవినీతి అనకొండ వద్ద మరింత లోతుగా విచారణ జరిపేందుకు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 7వ తేదీ వరకు ఏసీబీ అధికారుల కష్టకీ ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయను బుధవారం జైలు నుంచి తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. 
 
'గత పన్నెండేళ్లలో శివబాలకృష్ణ ఆదాయం రూ.2.48 కోట్లు కాగా.. ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే రూ.8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. ఈ పన్నెండేళ్లలో ఆయన కుటుంబ ఖర్చులు పోను సుమారు రూ.64 లక్షలు మిగులుతాయని, ఆపై సంపదంతా అక్రమార్జనేనని అనుమానిస్తోంది. ఈక్రమంలో హెచ్ఎండీఏ, ఎంఏ-యూడీ, రెరాల్లో ఆయన పనిచేసిన కాలంలో మంజూరు చేసిన అనుమతులపై ఏసీబీ దృష్టిసారించనుంది. అడ్డదారిలో అనుమతులు ఇచ్చి, భారీగా నజరానాలు అందుకొని ఆస్తులు కొనుగోలు చేసి ఉంటారని ఏసీబీ అనుమానిస్తోంది. ఆయా అనుమతులు పొందిన స్థిరాస్తి వ్యాపారులను సైతం ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ చిరునామాతో ఉన్న ఓ ఇన్ఫ్రా ప్రాజెక్టులో శివబాలకృష్ణకు వాటాలున్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ.. ఆ సంస్థ ఆర్థిక లావాదేవీలపై దృష్టిసారించడం ప్రాధాన్యం సంతరించుకొంది. సోదాల్లో.. శివబాలకృష్ణ భార్య, కుమార్తె, కుమారుడు, సోదరుడు నవీన్ కుమార్, ఆయన భార్య పేరిట పలు ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. శివబాలకృష్ణ బినామీ పెంట భరత్ కుమార్ పేరిట నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలో సుమారు పదెకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. 
 
మొత్తంగా వీరందరి పేరుతో ఉన్న భూములు, ప్లాట్లు, ఫ్లాట్లు, విల్లాల విలువ ప్రభుత్వ ధరల ప్రకారం సుమారు రూ.4.99 కోట్లుగా తేల్చారు. బహిరంగ మార్కెట్లో ఈ విలువ భారీగా ఉంటుందని భావిస్తున్నారు. నవీన్ కుమార్, ఆయన భార్య పేరిట పెద్దమొత్తంలో వ్యవసాయ భూములున్నట్లు తేలడంతో వారిని పిలిచి విచారించనున్నారు. అలాగే, శివబాలకృష్ణ పేరిట ఉన్న 8 బ్యాంకు లాకర్లతో పాటు కుటుంబసభ్యుల పేరిట ఉన్న లాకర్లను తెరవడంపైనా ఏసీబీ దృష్టిసారించింది.