శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2024 (16:54 IST)

తీర్పు ఇచ్చేవరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దు : హైకోర్టు

formula e-race car
ఈ-ఫార్ములా రేస్ వ్యవహారంలోని కేసుపై తీర్పు వెలువరించే వరకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఫార్ములా ఈ-రేస్ కేసుకు నిధుల మళ్లింపు వ్యవహారంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయని పేర్కొంటూ ఆ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు కేటీఆర్‌పై కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ ముగిసింది. అయితే, ఈ కేసులో తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులను మరోమారు పొడగించింది. 
 
కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై గత విచారణ సందర్భంగా ఈనెల 30 వరకు అరెస్టు చేయొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ధర్మాసనం ఈనెల 27కి వాయిదా వేసింది. ఆ తర్వాత విచారణ 31కి వాయిదా పడింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియగా.. కేటీఆర్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసింది. తీర్పు ఇచ్చే వరకు అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు పొడిగించింది.
 
కాగా, ఏసీబీ తరపు అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎ.సుదర్శన్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ, ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రూ.46 కోట్ల బ్రిటన్‌ పౌండ్లు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. ఈ-కార్ల రేసింగ్‌ సీజన్‌-10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. అయితే, దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. 
 
కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్‌ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్‌ కుమార్‌, బీఎల్‌ఎన్‌ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరిని అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్‌ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు.