శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 మార్చి 2024 (09:01 IST)

కుర్చీలో దర్జాగా కూర్చొని మీసం మెలేస్తున్న భట్టి విక్రమార్క.. రాహుల్ ప్లేట్‌లోని దోశను లాగిస్తున్న కోమటిరెడ్డి...

rahul - komatireddy
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మంత్రులు చేపట్టిన యాదగిరిగుట్ట పర్యటన వివాదాస్పదమైంది. ఈ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు స్టూల్స్‌‍పై కూర్చోగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ వంటివారు నేలపై కూర్చొన్నారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అవమానించారని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రచారం చేశారు. ఈ విమర్శలకు కాంగ్రెస్ పార్టీ ధీటుగా స్పందించింది. 
 
యాదగిరి గుట్టలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మంత్రులు సీఎం పక్కన ఉన్నారని, భద్రాద్రిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర రావులు సీఎం పక్కన ఉన్నారని గుర్తుచేసింది. అలాగే, సోషల్ మీడియాలో భారాస నేతలు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్న ఫోటోలకు కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా కౌంటరిచ్చింది.
revanth - bhatti
 
"కాంగ్రెస్ ఫర్ తెలంగాణ" అనే ట్విట్టర్ హ్యాండిల్‌లో భట్టివిక్రమార్క కుర్చీలో దర్జాగా కూర్చొనివుండగా, మంత్రి కోమటిరెడ్డి వంటి సీనియర్ నేతలు కింద కూర్చొనివున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లు భట్టి విక్రమార్కలు పక్కపక్కన కుర్చీల్లో కూర్చొవుండగా, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కింద కాళ్లపై కూర్చొని రాహుల్ గాంధీ చేతిలోని దోశను ఆరిగిస్తున్నట్టుగా ఉంది. కాంగ్రెస్ అంటేనే ఆకాశమంతా సమానత్వం అని పేర్కొంది. ఈ ఫోటో ఇపుడు నెట్టింట వైరల్ అయింది. 
 
మరో ట్వీట్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాలుపై కాలువేసుకుని కూర్చొనివుండగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీసాలు దువ్వుతున్నట్టుగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఇందులో వారిద్దరూ నవ్వుతూ సరదాగా ముచ్చటించుకున్నారు. తగిలే రాళ్లను పునాది చేసి ఎదగాలని, తరిమేవాళ్లను హితులుగా తరిచి ముందుకెళ్లాలని అని ట్వీట్ చేసింది.