హైవేపై 100 నుంచి 150 కి.మీ వేగంతో వెళ్తున్నారు, అందుకే ప్రమాదాలు
రోడ్డు ప్రమాదాలు. రహదారులపై ఎన్ని సూచికలు పెట్టినా, అతివేగం వద్దని చెప్పినా చాలామంది వాటిని పట్టించుకున్న దాఖలాలు వుండవు. జాతీయ రహదారిపైకి కారు వచ్చిందంటే... ఒక్కసారిగా 100 కిలోమీటర్ల వేగం పెంచి దూసుకెళ్తుంటారు. ఇలా అతివేగంతో వెళ్లడం ఏ కాస్త తేడా వచ్చినా ప్రాణాలు పోతున్నాయి. కోదాడలో గురువారం తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీనికి అతివేగంతో పాటు నిద్రలేమి కూడా కారణమని తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలపై డీఎస్పీ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ఎక్కువగా రాత్రంతా నిద్రపోకుండా తెల్లవారు జామున లాంగ్ డ్రైవ్ చేయడం వల్ల తెలియకుండానే కునుకు వస్తుంది.
తెల్లవారు జామున జరిగే ప్రమాదాల్లో ప్రధాన కారణం ఇదే అవుతోంది. ప్రతిరోజు తాము హైవేలపై స్పెషల్ డ్రైవ్ లు పెడుతూ భారీ వాహనాలు రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకుంటున్నాము. భారీ వాహనాలు ఎక్కడైనా రోడ్డుపై నిలిచిపోయినప్పుడు 1033కి ఫోన్ చేయాలని చెబుతున్నాము.
ఒకవేళ వాహనం ఆగిపోతే ఇతర వాహనదారులకు అది తెలిసేలా రేడియం స్టిక్కర్లతో బోర్డు పెట్టాలని తెలియజేస్తున్నాము. అన్నింటికి మించి జాతీయ రహదారులపై గంటకు 80 కిలోమీటర్లకి మించిన వేగంతో వెళ్లరాదు. కానీ చాలామంది 100 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నారు. ప్రతిరోజూ హైవేపై స్పీడ్ ఉల్లంఘనపై 100కి పైగా చలాన్లు వేస్తున్నాము అని చెప్పారు.