శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2024 (09:28 IST)

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

ktrao
భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ పోలీసులు ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ-కారు రేసుకు నిధుల మళ్లింపు అంశంలో కేటీఆర్‌ ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసు ఆయన మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు సర్కారు నిర్ణయించింది. 
 
పైగా, ఈ కేసులో కేటీఆర్‌ను విచారించేందుకు ఇప్పటికే గవర్నర్ ఆనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అవినీతి నిరోధక శాఖకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి నేడో రేపో కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఈ మేరకు సోమవారం జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో సుధీర్ఘంగా చర్చించి, మంత్రుల అభిప్రాయాలను కూడా సీఎం రేవంత్ తీసుకున్నారు. 
 
కేటీఆర్‌పై విచారణకు సంబంధించి ఇప్పుడే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని, ఈ విషయంలో జాప్యం జరిగితే ఉపయోగంవుండదని మెజార్టీ మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో, ఫార్ములా వన్ ఈ-కార్ రేసుకు సంబంధించి కేటీఆర్‌పై కేసు నమోదుకు అనుమతిస్తూ గవర్నర్ పంపిన పత్రాలను సోమవారం రాత్రే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని నిర్ణయించారు. అనంతరం అక్కడి నుంచి ఏసీబీకి పంపనున్నారు. ఏసీబీ దర్యాప్తులో భాగంగా తొలుత ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్‌కు నోటీసులిచ్చి, అరెస్టు చేసే ఆవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.