కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...
ఈమధ్య కాలంలో గుండెపోటు సమస్యలతో మరణిస్తున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా మరో విషాదకర సంఘటన ఎల్బీ నగర్ పోలీసు స్టేషనులో జరిగింది. స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న 58 ఏళ్ల సంజయ్ సావంత్ రోజు మాదిరిగానే నిన్న స్టేషనుకు వచ్చాడు. రాత్రయ్యాక తనకు కాస్త అలసటగా వుందనీ, బెడ్ పైన కాస్త విశ్రమించి వెళ్తానంటూ తోటి ఉద్యోగులతో చెప్పాడు.
దాంతో ఆయనను ఎవరూ డిస్టర్బ్ చేయలేదు. ఐతే ఈరోజు ఉదయం సంజయ్ లేవకుండా అలాగే బెడ్ మీద పడుకుని వుండటాన్ని గమనించిన సిబ్బంది ఆయనను నిద్ర లేపే ప్రయత్నం చేసారు. ఐతే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీనితో వెంటనే ఆయనను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.