శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 సెప్టెంబరు 2024 (09:45 IST)

భయపెడుతున్న వరుణుడు : నాలుగు రోజుల పాటు వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్!

rain
వరుణుడు భయపెడుతున్నారు. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఆరెంజ్ అలెర్ట్ చేసింది. గురువారం జయశంకర్, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వివరించింది. రాష్ట్రంపై రుతుపవనాలు ఉదృతంగా వీస్తున్నాయి. ఉత్తరాంధ్ర వద్ద బంగాళాఖాతం తీర ప్రాంతంపై 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. దీని ప్రభావంతో గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని ఈ శాఖ ప్రకటించింది. 
 
మరోవైపు రుతుపవన గాలుల ద్రోణి 1500 మీటర్ల ఎత్తున రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి మధ్యప్రదేశ్, రామగుండం, కళింగపట్నం మీదుగా బంగాళాఖాతం వరకూ వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. గత నాలుగు రోజులుగా కుంభవృష్టి కురిసిన ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే మళ్లీ నాలుగు రోజుల పాటు భారీగా వర్షం కురిసే సూచనలున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశాలున్నాయని తెలిపింది.
 
రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు వరుసగా నాలుగో రోజూ కొనసాగాయి. మంగళవారం ఉదయం 8.30 నుంచి బుధవారం 8.30 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా సిద్దిపేట జిల్లా కోహెడలో 22.3 సెం.మీ. వర్షం కురిసింది. ఇదే జిల్లా సముద్రాలలో 21.6, శనిగరంలో 17.2, అబ్దుల్లాపూర్ (నిర్మల్)లో 19.8. తొండకూర్ (నిజామాబాద్) లో 16.2, అక్కెనపల్లి (పెద్దపల్లి)లో 14.9 సెం.మీ. వర్షం కురిసింది. పలుచోట్ల 10 సెం. మీ. కన్నా ఎక్కువ వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.30 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా బుధవారం పగలు నీల్వాయి (మంచిర్యాల జిల్లా)లో 5.2, మారేడుపల్లి (జగిత్యాల)లో 4.1 సెం.మీ. వర్షం కురిసింది.