శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 ఫిబ్రవరి 2024 (16:50 IST)

నీటి కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగింత : సీఎం రేవంత్ వివరణ

revanth reddy
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు - కేఆర్ఎంబీ)కి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ నగరంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలు కేఆర్ఎంబీకి అప్పగించాలని ఈ సమావేశంలో ఏపీ, తెలంగాణలు నిర్ణయించాయి. ఈ అప్పగింతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్ నగరంలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 
 
ఇందులో ఆయన మాట్లాడుతూ, సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ప్రధాన కారణం కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్‌లదే తప్పమన్నారు. ఈ ముగ్గురు తాము చేసిన పాపాలు కప్పిపుచ్చి, ఆ పాపాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వంపై నెట్టివేసి ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేస్తూ అంతిమంగా రాజకీయ లబ్ధి పొందాలని వారు చూస్తున్నారని ఆరోపించారు. 
 
ఎన్నో రాత్రులు నిద్రపోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని తానే రాయించానని కేసీఆర్ చెబుతున్నారని, ఇపుడు ఆయననే సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. 2014లో కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నపుడు పార్లమెంటులో పునర్ విభజన చట్టం ఆమోదం పొందింది. ఈ చట్టానికి మీరే రచయిత అయినప్పుడు మీరే కథ కథనం నిర్వహించినపుడు కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 
 
మీరు 2014లో ఎంపీగా ఉన్నప్పుడే ప్రాజెక్టుల అప్పగింతకు పునాదిరాయి పడింది. మీ అనుమతి మేరకు, మీ సూచన మేరకే నాటి కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. లోక్‌‌సభలో, రాజ్యసభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరు కూడా ఈ చట్టానికి ఓట్లు వేసి ఆమోదించారు. ఇవాళ ఈ ప్రాజెక్టులు కేంద్రానికి అప్పగించడం వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతుంది అంటే అందుకు బాధ్యులు కేసీఆర్, కేశవరావు. కేసీఆర్ నాడు లోక్‌సభలో ఉన్నారు, కేశవరావు రాజ్యసభలో ఉన్నారని గుర్తుచేశారు. 
 
కృష్ణా నదీ ప్రాజెక్టుల ద్వారా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రైబ్యునల్ కేటాయించింది 811 టీఎంసీలు. అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీల నీటిని పంపకాలు చేశారు. మరి ఇప్పుడు కృష్ణా నది నీటిలో సగం వాటా కావాలంటున్నవారు అప్పుడెందుకు అడగలేదు? కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం తెలంగాణలో 68 శాతం, ఏపీలో 32 శాతం ఉంది. ఏ ప్రాంతంలో ఎక్కువ నదీ పరీవాహక ప్రాంతం ఉంటుందో, అంత శాతం ఆ ప్రాంతానికి నీటి కేటాయింపులు ఉండాలని అంతర్జాతీయ విధివిధానాలు చెబుతున్నాయి. ఆ లెక్కన 500 పైచిలుకు టీఎంసీల నీరు తెలంగాణకు, 200 పైచిలుకు టీఎంసీల నీరు మాత్రమే ఏపీకి పోవాలి. కానీ పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. 
 
తెలంగాణకు రావాల్సిన నీటి వాటా రాకుండా, ఆ హక్కులను ఏపీకి ధారాదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే. ఇప్పుడు తెలంగాణకు ఏదైనా నష్టం జరిగితే అందుకు బాధ్యులు కేసీఆర్, హరీశ్ రావు, ఈఎన్సీ మురళీధర్ రావు. 2015లో కేఆర్ఎంబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వీళ్లు ఆమోదించడం ద్వారా తెలంగాణకు తీరని నష్టం కలుగజేశారు అని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.