Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి
తెలంగాణ అంతటా తీవ్రమైన శీతాకాలం ప్రారంభమైంది. హైదరాబాద్ జిల్లాలు, శివార్లలోని అనేక ప్రదేశాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి. ఇంకా పొడి, చల్లని గాలులు కొనసాగుతాయని, మరింత తీవ్రమవుతాయని, సోమవారం హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ నుండి 3 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుతాయని సూచించింది.
ఆదిలాబాద్, కుమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్ వంటి ఉత్తర జిల్లాలే కాదు.. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలైన సేర్లింగంపల్లి, హైదరాబాద్ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్ కూడా స్థిరంగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేస్తున్నాయి. కుమరంభీం ఆసిగాబాద్‌లోని సిర్పూర్‌లో కనిష్టంగా 7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సేర్లింగంపల్లి, యుఓహెచ్‌తో సహా హైదరాబాద్ శివారు ప్రాంతాలలో 8 డిగ్రీల సెల్సియస్, 9.8 డిగ్రీల సెల్సియస్ మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు ఇబ్రహీంపట్నంలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైన ఇతర ప్రాంతాలలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో 11.2 డిగ్రీల సెల్సియస్, వెస్ట్ మారేడ్‌పల్లి 11.5 డిగ్రీల సెల్సియస్, అల్వాల్ 11.9 డిగ్రీల సెల్సియస్, కుత్బుల్లాపూర్‌లో 12 డిగ్రీల సెల్సియస్, గచ్చిబౌలి 12.1 డిగ్రీల సెల్సియస్, మల్కాజ్‌గిరి 12.7 డిగ్రీల సెల్సియస్ ఉన్నాయి.
హైదరాబాద్‌లోని మిగిలిన ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 13 డిగ్రీల సెల్సియస్, 15 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉన్నాయి.
ఇక తెలంగాణ అంతటా రాబోయే 2 రోజులు ఇదే విధమైన ఉష్ణోగ్రతలు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఉష్ణోగ్రతలో క్రమంగా మెరుగుదల ఉంటుందని భావిస్తున్నట్లు తెలంగాణ వెదర్ రిపోర్ట్ చెప్తోంది.