సర్పంచ్ పదవికి వేలం పాట... ధర రూ.73 లక్షలు.. పోటీ నుంచి తప్పుకున్న ప్రత్యర్థులు..
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామ సర్పంచ్ పదవులు కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వేలం పాటల్లో కొత్త సర్పంచ్‌లను ఎంపిక చేస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా బంగారిగడ్డ గ్రామంలో సర్పంచ్ పదవిని ఓ మహిళ రూ.73 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మొత్తాన్ని గ్రామాభివృద్దికి ఖర్చు చేయనున్నారు. ఈ పదవిని మహమ్మద్ సమీనా ఖాసీం దక్కించుకున్నారు. ఆమెకు గ్రామస్థులంతా మద్దతు ఇవ్వడంతో ఈ పదవికి ఖాసీం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి ఏకంగా 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు సమర్పించారు. అయితే, ఎన్నికల కంటే గ్రామాభివృద్దే ముఖ్యమని భావించిన గ్రామస్థులు, సర్పంచ్ పదవిని ఏకగ్రీవం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. దీనిపై చర్చించేందుకు గ్రామంలో ఓ సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో ముగ్గురు అభ్యర్థులు గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయ అభివృద్ధికి, ఇతర పనులకు తాము నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీంతో గ్రామ పెద్దలు సర్పంచ్ పదవికి వేలం పాటను నిర్వహించారు. ఇందులోమహమ్మద్ సమీనా ఖాసీం అనే మహిళా అభ్యర్థి గ్రామాభివృద్ధికి రూ.73 లక్షలు ఇస్తానని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఆఫర్‌కు మిగిలిన అభ్యర్థలంతా అంగీకరించడంతోపాటు తమ నామినేషన్లను కూడా ఉపసంహరించుకున్నారు. దీంతో బంగారిగడ్డ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం అయింది. అయితే, ఎన్నికల అధికారులు మాత్రం ఏకగ్రీవంగా ప్రకటించాల్సివుంది.