ప్రమాదమూ లేదూ పాడూ లేదు ... నేను క్షేమంగా ఉన్నాను : కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ కారు ప్రమాదంలో చిక్కుకున్నారని, ఆమె గాయపడినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అయింది. దీనిపై ఆమె స్పందించారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని క్షేమంగానే ఉన్నట్టు చెప్పారు. తాను క్షేమంగానే ఉన్నానని ఆ వార్తలన్నీ రూమర్స్ మాత్రమేనని చెప్పారు. కాజలు యాక్సిడెంట్ అయిందనే వార్తలు సోమవారం సాయంత్రం సోషల్ మీడియాలో వైరలైన విషయం తెల్సిందే. దీంతో ఆందోళన చెందిన అభిమానులు ఆమెను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. దీనిపై కాజల్ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించారు.
'నేను ప్రమాదంలో ఉన్నానని (ఇక లేనని కూడా!) వస్తోన్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే అవి చూసి నేను నవ్వుకున్నాను. ఎందుకంటే ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తి అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. ఇలాంటి తప్పుడు వార్తలు నమ్మొద్దు, ప్రచారం కూడా చేయొద్దని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి ఫేక్ న్యూస్‌ను షేర్ చేసే బదులు ఏదైనా నిజమైన వార్తలను నలుగురితో పంచుకోండి' అంటూ నోట్ విడుదల చేశారు.