శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (11:28 IST)

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

AR Rahman
సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌పై ఆయన భార్య సైరా బాను ప్రశంసల వర్షం కురిపించారు. తన భర్త ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ఆడియోను విడుదల చేశారు. రెహమాన్ సంగీత బృందంలో బాసిస్ట్‌గా ఉన్న మోహిని డే అనే అమ్మాయి కారణంగానే ఈ విడాకులు అంటూ ప్రచారం జరుగుతోంది. రెహ్మాన్ విడాకులు తెరపైకి వచ్చిన రోజే... మోహిని డే భర్త నుంచి విడిపోతున్నట్టుగా పోస్టు పెట్టడం ఈ ఊహాగానాలకు నాంది పలికింది.
 
ఈ ప్రచారంపై సైరా బాను స్పందించారు. రెహ్మాన్ బంగారం వంటి వ్యక్తి అని, ఆయననేమీ అనొద్దని విజ్ఞప్తి చేశారు. గత కొన్ని నెలలుగా తాను ఆరోగ్యంగా లేనని, అందుకే రెహ్మాన్ నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆ మేరకు సైరా బాను న్యాయవాది వందనా షా ఓ వాయిస్ క్లిప్‌ను విడుదల చేశారు.
 
'నేను సైరా బానును మాట్లాడుతున్నాను. ప్రస్తుతం నేను ముంబైలో ఉన్నాను. గత కొన్ని నెలలుగా శారీరకంగా నా పరిస్థితేమీ బాగాలేదు. అందుకే రెహ్మాన్ నుంచి విడాకులు కోరుకుంటున్నాను. ఇదే మా విడాకులకు కారణం. యూట్యూబ్‌కు, యావత్ యూట్యూబర్లకు, తమిళ మీడియాకు నేను చేసే విజ్ఞప్తి ఒక్కటే... దయచేసి రెహ్మాన్ గురించి చెడుగా ప్రచారం చేయవద్దు. నా అనారోగ్యం వల్లే చెన్నై నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది.
 
నేను ఎక్కడున్నానో నాకు తెలుసు... కానీ మీరే (మీడియా) సైరా ఎక్కడుందంటూ వెతుకుతున్నారు. నేను చికిత్స తీసుకునేందుకు ముంబై వచ్చాను. నా పిల్లలను కానీ, రెహ్మాన్‌ను కానీ ఎవరినీ నేను డిస్ట్రబ్ చేయదలుచుకోలేదు. కానీ రెహ్మాన్ ఓ అద్భుతమైన వ్యక్తి. అతడ్ని అలా వదిలేయండి. నేను అతడ్ని ఎంతగా ప్రేమించానో చెప్పడానికి ఇదే నిదర్శనం. అతడు కూడా నన్ను అలాగే ప్రేమించాడు. దయచేసి అతడిపై తప్పుడు ఆరోపణలు చేయకండి. అతడ్ని బజారుకీడ్చవద్దు. త్వరలోనే చికిత్స పూర్తి చెన్నై వస్తాను' అంటూ సైరా బాను తన వాయిస్ నోట్‌లో వివరించారు.