శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2024 (17:57 IST)

నటుడుగా 65 యేళ్లు.. కమల్ హాసన్ సినీ ప్రస్థానం

kamal haasan
సినీ నటుడుగా విశ్వ నటుడు కమల్ హాసన్ 64 యేళ్ళు పూర్తి చేసుకుని 65 యేటలోకి అడుగుపెట్టారు. ఆయన బాల నటుుగా నటించిన తొలి చిత్రం కలత్తూర్ కన్నమ్న. ఈ చిత్రం విడుదలై 64 యేళ్ళు పూర్తి చేసుకుంది. కలత్తూర్ కన్నమ్మ సినిమాతో నటుడిగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన కమల్ హాసన్.. తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డును అందుకున్నారు. 
 
బాలనటుడిగా శివాజీగణేశన్, ఎంజీఆర్, జెమినీ గణేషన్ లాంటి అగ్రనటులతో కలసి పనిచేశారు. యుక్తవయస్సుకు వచ్చాక సినిమాల్లో డాన్స్ డైరెక్టర్, ఫైటర్‌గా పనిచేశారు. ఆ తర్వాత భాషాబేధం లేకుండా నటుడిగా వచ్చిన సినిమాలన్నీ చేశారు. 1974లో మలయాళంలో వచ్చిన కన్యాకుమారీ కమల్‌ను హీరోగా నిలబెట్టింది. తెలుగులో అంతులేని కథ, మరో చరిత్ర సినిమాలతో గుర్తింపు లభించింది. అనంతరం స్వాతి ముత్యం, సాగర సంగమం, ఇంద్రుడు చంద్రుడు వంటి సినిమాల్లో నటనకు మూడు నంది అవార్డులను అందుకున్నారు.
 
హిందీలో కూడా ఏక్ దూజే కే లియే, గిరఫ్తార్, రాజ్ తిలక్ వంటి పలు సినిమాలతో నటించారు. జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. భామనే సత్యభామనే సినిమాలో ఆడ వేషంలో కనిపించినా.. విచిత్ర సోదరులు సినిమాలో పొట్టివాడిగా నటించినా, కమల్ ఆయా పాత్రలో ఒదిగిపొయి అద్బుతమైన నటనను కనబరిచారు. దశావతారం సినిమాలో పది పాత్రలతో మెప్పించారు‌. కమర్షియల్ సినిమాల్లోనూ ప్రయోగాలు చేశారు. పూర్తి ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన పుష్పక విమానం అలాంటిదే. మూకీ కమ్ స్లాప్ స్టిక్ కామెడీగా ఈ మూవీ అద్బుతమైన విజయాన్ని అందుకుంది. 
 
మణిరత్నం దర్శకత్వంలో నాయకుడు చిత్రంలో కమల్ నటన మరో వండర్. అన్ని వయసుల పాత్రలను అద్భుతంగా పోషించి నటుడిగా మరో స్థాయికి ఎదిగారు కమల్ హాసన్. ఈ సినిమా టైమ్ మాగజైన్ వారి ఆల్ టైం బెస్ట్ హండ్రెడ్ మూవీల్లో ఒకటిగా నిలిచింది. ఇక వరుస ప్లాప్‌లతో కమల్ హాసన్ పనైపోయిందుకున్న టైమ్‌లో విక్రమ్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు. ఇటీవలే విడుదలైన భారతీయుడు 2 సినిమా పరాజయం పాలైంది. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ సినిమా చేస్తున్నారు. ఇక ఎప్పటినుంచో కమల్ డ్రీమ్ ప్రాజెక్టు మరుదనాయగం పూర్తికాకుండా నిలిచిపోయింది. 
 
మర్మయోగిగా మరో వైవిధ్యమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావాలన్న ప్రయత్నం ఇంకా పూర్తి కావాల్సి ఉంది. నటుడిగా కమల్ హాసన్ మొత్తం 175‌కు పైగా అవార్డులు పొందారు. అందులో పదుల సంఖ్యలో ఫిలిం ఫేర్ అవార్డున్నాయి. ఉత్తమ బాల నటుడిగా ఒకటి, ఉత్తమ నటుడిగా మూడు జాతీయ అవార్డులు గెలుపొందారు. 1990లో పద్మశ్రీ, 2014లో పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న కమల్ హాసన్ 69 ఏళ్ల వయస్సులో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.