బుధవారం, 6 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 ఆగస్టు 2025 (17:48 IST)

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

kingdom banner
యువ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం కింగ్డమ్‌కు తమిళనాట నిరసన సెగ తలిగింది. ఈ చిత్రంలోని పలు సన్నివేశాలు శ్రీలంక తమిళులను కించపరిచేలా, వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటు పలు రాజకీయ పార్టీలు, తమిళ జాతీయ వాదులు ఆరోపిస్తున్నారు. అందువల్ల ఈ చిత్ర ప్రదర్శనపై నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే, ఈ చిత్రంలో శ్రీలంక తమిళులను ప్రతినాయకులుగా చూపించారని, తమిళులు ఆరాధ్య దైవంగా భావించే మురుగన్ పేరును విలన్‌కు పెట్టడంపై నామ్ తమిళ్ కచ్చి (ఎన్‌టీకే) పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది తమిళుల అస్తిత్వాన్ని, చరిత్రను కించపరచడమేనని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
 
ఈ ఆరోపణలతో తమిళనాడు వ్యాప్తంగా పలు థియేటర్ల వద్ద ఎన్టీకే కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రాష్ట్రంలో సినిమా ప్రదర్శనను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా, రామనాథపురంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఓ థియేటర్‌లో సినిమా ప్రదర్శనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఎన్టీకే సభ్యులకు మధ్య తోపులాట జరిగి స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
 
వెంటనే అదనపు బలగాలను మోహరించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఎలాంటి గాయాలు కాలేదని తెలిసినప్పటికీ, 'కింగ్డమ్' ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, తమిళ వ్యతిరేక కథనాలను ప్రోత్సహిస్తున్న ఈ సినిమాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిషేధించాలని నామ్ తమిళ్ కచ్చి పార్టీ తన డిమాండ్‌ చేసింది. ఈ వివాదంపై చిత్రబృందం గానీ, సెన్సార్ బోర్డు గానీ స్పందించి వివరణ ఇచ్చే వరకు ఈ ఆందోళనలు మరింత పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.