జూనియర్ ఎన్టీఆర్ మాట తప్పారంటూ అభిమాని తల్లి వ్యాఖ్యలు
ఇటీవలి కాలంలో టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలోని హీరోలు ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటున్నట్లు కనిపిస్తున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనతో అల్లు అర్జున్ (Allu Arjun) ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అలాగే మోహన్ బాబు (Mohan Babu) కుటుంబం ఆస్తి గొడవలతో రోడ్డున పడ్డారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) అభిమాని తల్లి ఎన్టీఆర్ పైన ఆరోపణలు చేసారు.
క్యాన్సర్‌తో బాధపడుతూ చెన్నై అపోలోలో చికిత్స పొందుతున్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అతడి తల్లి చెబుతున్నారు. ఆమధ్య అతడు 'దేవర' సినిమా చూసి చనిపోవాలని వుందనీ, అదే తన చివరి కోరిక అదే అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఐతే తన అభిమాని ప్రాణాంతక సమస్యతో బాధపడుతున్నాడని తెలిసి అతడి చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తానంటూ గతంలో కుటుంబ సభ్యులతో వీడియో కాల్ చేసి మాట్లాడారు జూనియర్ ఎన్టీఆర్. కానీ ప్రస్తుతం ఆయన వద్ద నుంచి ఎలాంటి స్పందన రావడం లేదని కౌశిక్ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కౌశిక్ చికిత్స కోసం మరో రూ. 20 లక్షలు ఆసుపత్రి ఫీజు చెల్లించాల్సి వుందనీ, డబ్బు కోసం ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు.