దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)
ప్రత్యక్ష, క్రియాశీలక రాజకీయాలకు టాటా చెబుతున్నట్టు సినీ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణమురళి ప్రకటించారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటించారు. ఇకపై జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడబోనని స్పష్టంచేశారు.
ఇక నుంచి ఏ రాజకీయ పార్టీతో తనకు సంబంధం లేదనీ, వైసీపీనే కాదు ఇప్పటివరకు ఏ పార్టీలో తనకు సభ్యత్వం లేదని చెప్పారు. ఇకపై ఏ పార్టీని పొగడను.. మాట్లాడను.. విమర్శించనని స్పష్టం చేశారు. తనను ఎవరూ ఏమనలేదు.. ఎవరి గురించి ఇక మాట్లాడను. ఓటర్ లాగే ప్రశ్నించా.. మంచి చేస్తే వాళ్లకి సపోర్టు చేశా. ఇపుడు తన కుటుంబం, పిల్లల కోసం రాజకీయాలు వదిలేస్తున్నట్టు పోసాని కృష్ణమురళి ప్రకటించారు.
కాగా, గత వైకాపా ప్రభుత్వ హయాంలో నోటికి ఇష్టమొచ్చినట్టు పోసాని కృష్ణమురళి మాట్లాడిన విషయం తెల్సిందే. ఇపుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయనపై ఏపీ వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల నుంచి తప్పించుకునేందుకు పోసాని రాజకీయాలను వదిలివేస్తున్నట్టు ప్రకటించారనే టాక్ వినిపిస్తుంది.