శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 26 డిశెంబరు 2024 (18:58 IST)

నవీన్ పొలిశెట్టి పెండ్లి కోసం ప్రీ వెడ్డింగ్ వీడియో షూట్

Naveen Polishetty, Meenakshi Chaudhary
Naveen Polishetty, Meenakshi Chaudhary
కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తీవ్ర గాయాల కారణంగా సంవత్సరం పాటు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, తన నూతన చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

నవీన్ పొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్‌ను నేడు నిర్మాతలు ఆవిష్కరించారు. నవీన్ పొలిశెట్టి మాదిరిగానే ఈ వీడియో ఎంతో ప్రత్యేకంగా మరియు పూర్తి వినోదాత్మకంగా ఉంది.
 
ప్రీ వెడ్డింగ్ వీడియోలో నవీన్ పొలిశెట్టి పోషించిన రాజు పాత్ర తన వివాహానికి సిద్ధమవుతున్నట్లు చూపించారు. రాజు గారి పెళ్ళి అంటే ఎలా ఉండాలి? అంటూ భోజనాల దగ్గర చమ్మక్ చంద్ర చేసిన హడావుడి నవ్వులు పూయించింది. ఇక అనంత్ అంబానీ వివాహానికి హాజరైన హాలీవుడ్ ప్రముఖుల ఫోన్ నెంబర్ల కోసం, నవీన్ ఏకంగా ముఖేష్ అంబానీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు చూపించడం కడుపుబ్బా నవ్వించింది.  అలాగే ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ సమయంలో వధువుగా మోస్ట్ హ్యాపెనింగ్ నటి మీనాక్షి చౌదరి కనిపించారు. ఈ ఫోటోషూట్ సమయంలో కూడా నవీన్ పోషించిన రాజు పాత్ర నవ్వులు పంచింది.
 
రాజుగా నవీన్ పొలిశెట్టి మార్క్ హాస్యం, అద్భుతమైన విజువల్స్, సంగీతం ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ ని బ్లాక్ బస్టర్ గా మలిచాయి. ముఖ్యంగా నవీన్ కామెడీ టైమింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే, ఫోటోషూట్ సమయంలో మీనాక్షి చౌదరితో నవీన్ కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. వెండితెరపై ఈ అందమైన జోడి, ప్రేక్షకులను మాయ చేయడం ఖాయమనిపిస్తోంది.
 
చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. 2025లో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా విడుదలైన ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్, ఈ చిత్రంతో నవీన్ పొలిశెట్టి మరో ఘన విజయాన్ని ఖాతాలో వేసుకోవడం ఖాయమని హామీ ఇస్తుంది.