సోమవారం, 3 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (17:46 IST)

Ram Charan : ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

Ram Charan as brand ambassador for Archery Premier League
Ram Charan as brand ambassador for Archery Premier League
భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)కు గ్లోబ్‌ ఐకాన్‌ రామ్‌చరణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌(ఏఏఐ)  అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా అక్టోబర్‌ 2ను ంచి 12వ తేదీ వరకు అరంగేట్రం ఏపీఎల్‌ జరుగనుంది.
 
ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌గా జరుగబోతున్న టోర్నీలో ఆతిథ్య భారత్‌లోని పురుష, మహిళా కాంపౌండ్‌, రికర్వ్‌ ఆర్చర్లతో పాటు  వివిధ దేశాల ఆర్చర్లను ఒక చోటుకు చేర్చనుంది. దేశీయ ఆర్చరీకి అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంతో పాటు భారత ఒలింపిక్‌ మూమెంట్‌ను మరింత ముందుకు తీసుకుపోయే ఉద్దేశంతో లీగ్‌ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పేర్నొన్నారు. లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీల్లో 36 మంది  భారత టాప్‌ ఆర్చర్లతో సహా 12 మంది  అంతర్జాతీయ ఆర్చర్లు పోటీపడనున్నారు. లైట్ల వెలుతురులో గతంలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్‌ ఫార్మాట్‌ ద్వారా ఆర్చర్లు రికర్వ్‌, కాంపౌండ్‌ విభాగాల్లో పోటీపడనున్నారు.
 
ఈ సందర్భంగా రామ్‌ చరణ్‌ మాట్లాడుతూ ‘ఆర్చరీ అనే క్రీడ..క్రమశిక్షణ, ఫోకస్‌, స్థితిస్థాపకతను కల్గి ఉంటుందన్న కారణంతో బంధం ఏర్పరుచుకోవడం జరిగింది. ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌లో కలిసి కొనసాగడం గర్వంగా ఉంది. భారత ఆర్చర్లకు అంతర్జాతీయ వేదిక కావడమే కాదు గ్లోబల్‌ స్పాట్‌లైట్‌లో మెరిసే అవకాశం కల్పిస్తుంది. భవిష్యత్‌ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నాడు.
 
జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌ అధ్యక్షుడు అర్జున్‌ ముండా స్పందిస్తూ ‘దేశంలోని వివిధ గ్రామాల్లో ఉన్న ఆర్చర్లకు ప్రతిభ నిరూపించుకునేందుకు ఏపీఎల్‌ వేదికగా ఉపయోగపడనుంది. ఏపీఎల్‌ ద్వారా వారి భవిష్యత్‌ లక్ష్యాలను ఆవిష్కరించేందుకు అవకాశం లభిస్తుందన్న గట్టి నమ్మకం మాకుంది. దీనికి తోడు ఆర్చరీని మరో స్థాయిని తీసుకెళ్లేందుకు ఈ లీగ్‌ దోహదం చేస్తుంది. రామ్‌చరణ్‌ బ్రాండ్‌అంబాసీడర్‌గా దేశంలోని మరింత మంది యువత ఆర్చరీ పట్ల ఆకర్షితమయ్యేందుకు ఆస్కారం ఉంటుంది’ అని అన్నారు.
 
ఏఏఐ ప్రధాన కార్యదర్శి  వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ ‘దేశంలోని మిగతా లీగ్‌ల నుంచి స్ఫూర్తి పొందుతూ ఆర్చరీ లీగ్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో ప్రొఫెషనల్‌ స్థాయికి తగట్లు లీగ్‌ నిర్వహిస్తాం. ఇది కేవలం లీగ్‌ కాదు, భారత ఒలింపిక్‌ స్వప్నాన్ని చేరుకునేందుకు ఒక మెట్టుగా మారనుంది. రామ్‌చరణ్‌ ఎంపిక ద్వారా లీగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా మెరుగైన ఆదరణ లభిస్తుందన్న నమ్మకం ఉంది’ అని అన్నారు.