భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్
తనను భర్తగా చూడలేదని బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారని కోలీవుడ్ హీరో రవి మోహన్ అన్నారు. తన భార్య ఆర్తికి విడాకులు ఇవ్వడం కోసం కోర్టును ఆశ్రయించడం, బెంగుళూరు గాయని కెనిషా ఫ్రాన్సిస్‌తో రిలేషన్‌లో తదితర అంశాలపై రవి మోహన్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు.
గాయని కెనిషాను ప్రస్తావిస్తూ, కెనిషా ఎంతో మంచి వ్యక్తి అని అన్నారు. ఆమెకు గౌరవ, మర్యాదలు దక్కాలన్నారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలోనూ తన వ్యక్తిగత జీవితంపైనే కొంతమంది దృష్టి సారించడం బాధగా ఉందన్నారు. తన గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని వాపోయారు. తన మౌనం బలహీనత కాదని తెలిపారు. తన ప్రయాణం, తగిలిన ఎదురుదెబ్బల గురించి తెలియని వాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే తాను పెదవి విప్పక తప్పదన్నారు.
హార్డ్‌వర్క్‍తో నా కెరీర్‌ను నిర్మించుకున్నాను. వ్యక్తిగత లాభం, చౌకబారు సానుభూతి పొందడం కోసం నా గత వివాహ బంధాన్ని ఉపయోగించను. నా వరకూ ఇదేం ఆట కాదు. ఇది నా జీవితం. చట్టపరమైన ప్రక్రియకు పూర్తిగా కట్టుబడి ఉన్నా. గౌరవప్రదంగా ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తా. మానసిక, ఎమోషనల్, ఆర్థికపరమైన వేధింపుల నుంచి కోలుకున్నా. ఇన్నేళ్లుగా నా తల్లిదండ్రులను కూడా కలవలేకపోయా. వైవాహిక బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతో ప్రయత్నించా. ఎంతో ఆలోచించి, ఎట్టకేలకు ధైర్యం చేసి ఆ జీవితం నుంచి బయటకు వచ్చా. విడాకుల నిర్ణయంపై ఇప్పటికే కుటుంబసభ్యులు, అభిమానులతో మాట్లాడా. ఈ విషయం గురించి మౌనంగా ఉండటం కూడా తప్పేనని అర్థమైంది.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత నన్ను తక్కువ చేసేలా ఎన్నో అసత్య ప్రచారాలు తెరపైకి వచ్చాయి. ఆయా వదంతులను పూర్తిగా ఖండిస్తున్నా. నిజాన్ని విశ్వసిస్తున్నా. తప్పక న్యాయం జరుగుతుందని నమ్ముతున్నా. ఆర్థిక లాభం, ప్రజల సానుభూతి పొందడం కోసం నా పిల్లలను ఒక సాధనంగా వాడుకోవడం చూస్తుంటే నాకెంతో బాధగా ఉంది. నా పిల్లలు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. నా భార్య, కుటుంబం కోసం అన్నివిధాలుగా సపోర్ట్ చేశా. ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురైన తర్వాత ఆర్తి నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నా. అంతేకానీ, నా పిల్లలను వదిలేయాలని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ల కోసమే జీవిస్తున్నా" అని రవి తెలిపారు.
స్నేహితులుగానే కెనిషాతో పరిచయం మొదలైంది. జీవితంలో నిరాశ, కన్నీళ్లు, బాధ మిగిలిన సమయంలో ఆమె నాకెంతో సపోర్ట్‌గా నిలిచింది. కట్టు బట్టలతో ఒక రాత్రి వేళ ఇంటి నుంచి బయటకు వచ్చేసిన సమయంలో తనే నాకు అండగా నిలిచింది. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెనుకాడలేదు. ఆమె ఒక అందమైన భాగస్వామి. ఆమె గురించి, ఆమె వృత్తి గురించి ఎలాంటి అమర్యాదకరమైన ప్రచారాన్ని అనుమతించాలనుకోవడం లేదు" అని ఆయన రాసుకొచ్చారు.