శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 నవంబరు 2024 (18:45 IST)

తెలుగు ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా : నటి కస్తూరి

kasturi
తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు తమిళ సినీ నటి కస్తూరి ప్రకటించారు. ప్రతి ఒక్కరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ఆమె తెలిపారు. ఈ మేరకు మంగళవారం తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. 
 
ఈ నెల మూడో తేదీన చెన్నై ఎగ్మోరులో జరిగిన ఓ కార్యక్రమంలో తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఆ రోజున తాను మాట్లాడిన ముఖ్యమైన అంశం ఈ వివాదంతో మరుగునపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, గత రెండు రోజులుగా తనకు అనేక బెదింపులు వస్తున్నాయనీ, ఇవి సమస్యను మరింత తీవ్రతరం చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. 
 
భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే మనదేశంలో తాను నిజమైన జాతీయవాదినని, కులమత, ప్రాంతీయభేదాలకు దూరంగా ఉండే తాను తెలుగు ప్రజలతో మంచి సత్సంబంధాలను కలిగివున్నట్టు చెప్పారు. ఇది తనకు లభించిన మహాభాగ్యంగా భావిస్తున్నట్టు చెప్పారు. నాయకర్లు, కట్టబొమ్మన్ల పేరు ప్రఖ్యాతలు, త్యాగరాజ కీర్తలను వింటూ పెరిగాననీ, తన తెలుగు సినీ ప్రయాణాన్ని ఎంతోగానే గౌరవిస్తాననీ, తెలుగు ప్రజలు తనకు పేరు ప్రఖ్యాతలతో పాటు మంచి ప్రేమాభిమానాలను పంచారని పేర్కొన్నారు. ఇదిలావుంటే, చెన్నై ఎగ్మోర్ పోలీస్ స్టేషనులో నటి కస్తూరిపై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.