శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (15:04 IST)

సీప్లేన్ పర్యాటకులకు వరం.. బాబు చేతుల మీదుగా లాంచ్.. జర్నీ కూడా? (video)

Sea Plane
Sea Plane
ఏపీలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పర్యాటకంగా, సాంకేతికంగా అభివృద్ధి చేసేందుకు కార్యక్రమాలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సీ ప్లేన్‌ను రంగంలోకి దించేందుకు సర్వం సిద్ధం చేసింది. 
 
విజయవాడలోని దుర్గామల్లేశ్వర ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి ఆలయం సందర్శనకు వెళ్లే భక్తులకు సౌలభ్యంగా ఉండేలా దీన్ని రూపొందిస్తున్నారు. సీ ప్లేన్స్ లాంచ్‌తో పర్యాటకంగా విజయవాడ మరింత అభివృద్ధి చెందుతుందని స్థానికులు అంటున్నారు. 
 
శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది, బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది.
 
విజయవాడ కేంద్రంగా అద్భుతం ఆవిష్కరణ కానుంది. రాష్ట్రంలో సీప్టేన్ సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకు పున్నమి ఘాట్ వేదిక కానుంది. విజయవాడ నుంచి శ్రీశైలంకు సీ ప్లేన్ సర్వీస్ ను చంద్రబాబు శనివారం ప్రారంభించనున్నారు.
 
నీటిలో టేకాఫ్ అయి నీటిలో ల్యాండ్ అవడం దీని స్పెషాలిటీ. డీ హవిల్లాండ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సంస్థ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు.
 
శ్రీశైలం జలాశయం ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పరిసర జలాల్లో సీ ప్లేన్ ల్యాండ్ కానుంది. సీ ప్లేన్ నుంచి సీఎం వచ్చిన తర్వాత రోప్ వే ద్వారా పైకి వచ్చి ఆలయానికి చేరుకుంటారు. 
 
శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్న తర్వాత సీఎం సీప్లేన్‌లో విజయవాడ వెళ్తారు. ప్రస్తుతం విజయవాడ నుంచి శ్రీశైలం మధ్య సీ ప్లేన్‌ నడిపేందుకు అనుకూలతలపై ప్రయోగం జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే పర్యాటకులకు సీ ప్లేన్ వరంగా మారనుంది. 
 
విశాఖ తీరం, నాగార్జునసాగర్, గోదావరి ప్రాంతాల్లోనూ సీ ప్లేన్ల ఏర్పాటుకు రెండోదశలో ప్రయోగాలు చేసే అవకాశాలున్నాయి. ఇటీవల జాతీయస్థాయి డ్రోన్‌ సమిట్‌ నిర్వహించగా ఇప్పుడు సీ ప్లేన్‌ ప్రయోగం చేస్తున్నారు.