శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: గురువారం, 18 జులై 2024 (19:54 IST)

చైనా, రష్యా స్నేహంతో భారత్‌ కంగారు పడుతోందా, మోదీ మాస్కో ఎందుకు వెళ్లారు?

modi - putin
రష్యా భూభాగంలో మూడింట రెండొంతులు ఆసియాలో ఉంటుంది. అయినప్పటికీ రష్యా విదేశాంగ విధానం ఎక్కువగా మధ్యప్రాచ్యం, ఆఫ్రికా కేంద్రంగా ఉంటుంది. ఇటీవల ఆసియా పసిఫిక్ మీద రష్యాకు పెరుగుతున్న ఆసక్తిపై అందరి దృష్టి నిలిచింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మే-జూన్ మధ్య చైనా, ఉత్తర కొరియా, వియత్నాంలలో పర్యటించి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఇటీవలే ఆయన మాస్కోలో భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలిశారు. దీంతో కలత చెందిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ, శాంతి ప్రయత్నాలకు ఇది భారీ ఎదురుదెబ్బ అని వ్యాఖ్యానించారు.
 
చైనా-రష్యా సంబంధాల్లో మార్పు
రష్యా నాయకులు పదేళ్ల కిందట వ్లాడివోస్టాక్‌లో ఆసియా పసిఫిక్ ఆర్థిక సహకార సమావేశాన్ని నిర్వహించారు. ఇలా చేయడం ద్వారా ఆసియాలో పెద్ద పాత్ర పోషించాలనే తమ ఉద్దేశానికి సంబంధించిన సంకేతాలు ఇవ్వడం ప్రారంభించారు. యుక్రెయిన్‌పై దాడి కంటే ముందే రష్యా, చైనాల మధ్య రక్షణ సహకారం పెరుగుతుందన్న సంకేతాలు వెలువడ్డాయి. ఇరు దేశాలు చాలా కాలంగా ఈశాన్య ఆసియా భద్రతపై సంప్రదింపులు జరుపుతున్నాయి. పలు వాయు, నౌకా విన్యాసాల్లో సంయుక్తంగా పాల్గొన్నాయి. ఇప్పటి వరకు చైనాతో తన సంబంధాల ప్రభావాన్ని భారత్‌పై పడనివ్వలేదు రష్యా.
 
‘‘భవిష్యత్తులో చైనాపై ఆర్థికంగా రష్యా ఆధారపడటం పెరిగేకొద్దీ ఈ సమీకరణం మారుతుంది" అని ‘ద డిప్లోమాట్’ మేగజైన్‌లో చైనా వ్యవహారాల నిపుణుడు మెర్సీ కువో రాశారు. కమ్యూనిస్ట్ ఉద్యమం ప్రారంభ రోజుల నుంచే సోవియట్ యూనియన్, చైనా చాలా సన్నిహితంగా ఉన్నాయి. కానీ, 1960ల ప్రారంభం నుంచి ఈ రెండింటి మధ్య సంబంధాలు తగ్గడం మొదలైంది. 1970ల నాటికి ఈ సంబంధాలు అత్యంత దారుణ స్థితికి చేరుకున్నాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత, అమెరికా గుత్తాధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఈ రెండు దేశాలు మళ్లీ ఒకదానికొకటి దగ్గరగా రావడం ప్రారంభించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యాకు చైనా కంటే ముఖ్యమైన దేశం మరొకటి లేదు.
 
అమెరికా ఆంక్షలను ఎదుర్కొనేందుకు రష్యాకు చైనా ఆర్థిక సహాయాన్ని కొనసాగిస్తుందని ఇటీవలే పుతిన్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చెప్పారు. చైనా మాత్రమే కాదు, ప్రపంచమంతటికీ దూరంగా ఉన్న ఉత్తర కొరియా కూడా రష్యాకు కొత్త వ్యూహాత్మక భాగస్వామిగా అవతరించింది. ఇది ఒక పెద్ద మార్పు. ఎందుకంటే ఏడేళ్ల క్రితం ఉత్తర కొరియా తన ఆరో అణు పరీక్షను నిర్వహించినప్పుడు ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి విధించిన కఠినమైన ఆంక్షలకు రష్యా మద్దతు ఇచ్చింది.
 
ఉత్తర కొరియాతో రష్యాకు పెరుగుతున్న సాన్నిహిత్యం
2000 సంవత్సరం తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవలే ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్‌ ఉన్‌ను ప్యాంగ్యాంగ్‌లో కలుసుకున్నారు. కిమ్ స్వయంగా విమానం మెట్ల వరకు వెళ్లి పుతిన్‌కు స్వాగతం పలికారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య సత్సంబంధాలు హఠాత్తుగా మెరుగుపడినవేమీ కాదు. 2023 సెప్టెంబర్‌లో వ్లాడివోస్టాక్‌లో జరిగిన సమావేశంలో, యుక్రెయిన్‌పై పోరాటంలో రష్యాకు ఆయుధాలు అందజేస్తామని ఉత్తర కొరియా హామీ ఇచ్చింది. దీనికి బదులుగా ఉత్తర కొరియాకు మిసైల్ ప్రోగ్రామ్‌లో సాంకేతిక సహాయం అందిస్తామని రష్యా మాట ఇచ్చింది. ఈ ఒప్పందం వివరాలు పూర్తిగా బహిర్గతం కాలేదు. అయితే, రక్షణ పరికరాలతో నిండిన అనేక నౌకలను ఉత్తర కొరియా, రష్యాకు పంపింది.
 
అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, 2023 సమావేశం తర్వాత ఉత్తర కొరియా ఆయుధాలతో నిండిన 11 వేలకు పైగా కంటైనర్లను మాస్కోకు పంపింది. రష్యా, ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం అమెరికా, యూరప్‌కు వ్యూహాత్మక సమస్య కావచ్చు.
 
వియత్నాంలో పుతిన్ పర్యటన
పుతిన్, ఉత్తర కొరియా పర్యటన తర్వాత వియత్నాం కూడా వెళ్లారు. 2013 తర్వాత వియత్నాంలో ఆయన పర్యటించడం ఇదే తొలిసారి. కానీ, ప్యాంగ్యాంగ్‌లో లభించినంత ఘనస్వాగతం వియత్నాంలో పుతిన్‌కు దక్కలేదు. పశ్చిమ దేశాలతో తమకు ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వియత్నాం చాలా జాగ్రత్తగా రష్యా వైపు అడుగులు వేస్తోందన్నమాట. రష్యా, వియత్నాం మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాలపై అమెరికాలో కొంత ఆందోళన ఉంది. అయినప్పటికీ, ఇది ఆ రెండు దేశాల సంబంధాలపై పెద్ద ప్రతికూల ప్రభావాన్ని చూపలేదు. గత కొన్నేళ్లలో అమెరికాతో వియత్నాంకు సాన్నిహిత్యం పెరిగింది. పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి వియత్నాం ఇష్టపడకపోవడానికి కారణం ఇదే కావొచ్చు.
 
ఆసియా పసిఫిక్‌లో రష్యా పాత్ర
ఆసియా పసిఫిక్ రీజియన్‌లో అమెరికా, చైనాలతో పోలిస్తే రష్యా పాత్ర చాలా తక్కువ. ఆయుధాలు, కొంతవరకు చమురు సరఫరాలను మినహాయిస్తే ఈ ప్రాంతంలో రష్యా పాత్ర పరిమితమే. ఇక్కడి దేశాలతో బలమైన సంబంధాలను నిర్మించుకోవడానికి రష్యా ప్రయత్నిస్తోంది. తద్వారా ఈ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని ఎదుర్కోవచ్చని భావిస్తోంది. ఈ విషయంలో రష్యా కొంత విజయాన్ని సాధించింది. జూన్‌లో స్విట్జర్లాండ్‌లో జరిగిన యుక్రెయిన్ శాంతి సదస్సుకు దక్షిణాసియాలోని సగం దేశాలు, పసిఫిక్ ప్రాంతంలోని దాదాపు అన్ని దేశాలు దూరంగా ఉన్నాయి. అక్కడికి వెళ్లిన కొన్ని దేశాలు, సదస్సు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేసేందుకు నిరాకరించాయి. దీనినిబట్టి ఈ ప్రాంతంలో రష్యా ప్రభావం పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే ఈ ప్రాంతంలో రష్యా ప్రభావం చాలా తక్కువే.
 
నరేంద్ర మోదీ, పుతిన్‌ల భేటీ
యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, తొలిసారి భారత ప్రధాని మోదీ మాస్కో వెళ్ళారు. అమెరికా ఆగ్రహానికి గురైన రష్యాతో మోదీ తన సంబంధాలను ఎలా సాగిస్తున్నారనే అంశంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది.
 
యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత చాలా పశ్చిమ దేశాలు రష్యాకు దూరంగా ఉన్నాయి. భారత్ మాత్రం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు, రక్షణ సహకారాన్ని పెంచింది. ఈ విషయాన్ని అమెరికా మాత్రమే కాదు, ఇతర మిత్రదేశాలు కూడా తీవ్రంగా భావించాయి.
 
విల్సన్ సెంటర్‌లోని దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్ మైఖేల్ కుగెల్‌మాన్ దీని గురించి రాశారు. “మోదీ మాస్కో పర్యటన, ప్రజలు అందరూ ఊహించినంతగా వాషింగ్టన్‌కు కోపం తెప్పించ లేదు. రష్యా ఇప్పటికీ భారత్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు. అయితే ఈ మధ్యకాలంలో రష్యా నుంచి ఆయుధాల దిగుమతిని భారత్ తగ్గించింది. అమెరికా నుంచి పెంచింది. భారత్, పశ్చిమ దేశాలతో సహకారాన్ని పెంచుకోవడమే కాకుండా రష్యాకు నచ్చని అమెరికా ‘ఇండో-పసిఫిక్’ విధానానికి మద్దతు పలుకుతోందన్నది అందరికీ తెలిసిన విషయమే.’’ అని ఆయన రాశారు.
 
భారత్ ప్రాముఖ్యత చెక్కు చెదరలేదు
భారత్‌కు అతిపెద్ద ప్రత్యర్థి చైనాతో రష్యా సాన్నిహిత్యం పెరగడమే కాకుండా, పాకిస్తాన్‌తో కూడా రష్యా రాజకీయ సంబంధాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. బ్రిక్స్, షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్ వంటి బహుళజాతి ఫోరమ్‌లలో రష్యా కీలకంగా మారింది. మరోవైపు, బ్రిక్స్, ఎస్‌సీవోతో పాటు ఇండో-పసిఫిక్ క్వాడ్‌లోనూ భారత్ సభ్యదేశమే. భారత విదేశాంగ విధానం ప్రధాన లక్ష్యం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాల మధ్య వారధిగా పనిచేయడం. ఇందులో రష్యా మద్దతు ఉన్న దేశాలు కూడా ఉన్నాయి.
 
యుక్రెయిన్‌తో రష్యా యుద్ధం వల్ల భారత్‌కు ప్రయోజనం ఉండదు. ఈ యుద్ధం భారత ఆహార, ఇంధన భద్రతకు నష్టం కలిగించింది. పైగా రష్యాను చైనాకు దగ్గర చేసింది. అమెరికా తరహాలో సూటిగా ఈ యుద్ధాన్ని భారత్ ఖండించలేదు. కానీ, దాన్ని ముగించాలని భారత్ పదేపదే విజ్ఞప్తి చేసింది. శాంతి పునరుద్ధరించాలంటూ మోదీ చేసిన విజ్ఞప్తిని పుతిన్ అంగీకరించలేదన్నది వేరే విషయం. నరేంద్ర మోదీ మాస్కో వెళ్లేందుకు మరో కారణం రష్యా, చైనాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని ఆపడం. మరోవైపు, రష్యా ఆర్థిక కారణాలతో చైనావైపు మొగ్గు చూపుతున్నప్పటికీ, భారత్‌తో వాణిజ్య, రక్షణ సంబంధాలను రష్యా ఇప్పటికీ విస్మరించలేదనే వాస్తవాన్ని కాదనలేం.