శుక్రవారం, 10 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 25 ఫిబ్రవరి 2024 (15:23 IST)

తృటిలో సెంచరీ చేజార్చుకున్న ధ్రువ్ జురెల్.. ఆసక్తికరంగా మారిన రాంచీ టెస్ట్

Dhruv Jurel
రాంచీ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత యువ క్రికెటర్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. రాంచీ టెస్టులో అరంగేట్రం చేసిన జురెల్... భారత జట్టుకు ఆపద్బాంధవుడిగా మారాడు. 150కి పైగా పరుగులతో వెనుకబడివున్న భారత జట్టును టెయిల్ ఎండ్ ఆటగాళ్లతో కలిసి జట్టు స్కోరును 300 పరుగులు దాటించాడు. దీంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్ 307 పరుగుల వద్ద ముగిసింది. ఇంగ్లండ్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగుల ఆధిక్యం లభించింది. 
 
భారత ఆటగాళ్లలో జైస్వాల్ 73, రోహిత్ శర్మ 2, గిల్ 38, పటీదార్ 12, సర్ఫాజ్ ఖాన్ 14, కుల్దీప్ యాదవ్ 28, అకాష్ దీవ్ 9 చొప్పున పరుగులు చేయగా, 23 రన్స్ అదనపు పరుగుల రూపంలో వచ్చాయి. అయితే, జురెల్ 149 బంతులు ఎదుర్కొని 90 పరుగులు చేశాడు. పది పరుగుల దూరంతో తొలి సెంచరీని మిస్ చేసుకున్నాడు. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్ లీ వేసిన బౌలింగ్‌లో బంతి గమనాన్ని అంచనా వేయడంలో పొరబడి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో స్పిన్ర్ షోయబ్ బషీర్ ఐదు వికెట్లు తీయడం గమనార్హం. మరో స్పిన్ర్ టామ్ హర్ట్‌ లే 3, సీనియర్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ రెండు వికెట్లు పడగొట్టాడు. 
 
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ జట్టును భారత స్పిన్నర్ ఆర్.అశ్విన్ దెబ్బతీశాడు. అశ్విన్ ధాటికి 65 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకంది. అయితే, ఓపెనర్ జాక్ క్రాలే, జానీ బెయిర్ స్టో జోడీ వికెట్ల పతనాన్ని అడ్డుకుంది. ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీయడంతో ఇంగ్లండ్ తన నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 60 పరుగులు చేసిన క్రాలేని కుల్దీప్ బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ స్కోరు 32 ఓవర్లలో నాలుగు వికెట్లకు 120 పరుగులు చేయగా, మొత్తంగా ఇంగ్లండ్‌కు 166 పరుగుల ఆధిక్యం లభించింది.