మంగళవారం, 7 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 జనవరి 2025 (16:45 IST)

ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న హిట్‌మ్యాన్‌ : కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ!?

virat kohli
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్‌ను శుక్రవారం నుంచి ఆడనుంది. ఈ మ్యాచ్‌కు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌ ఆద్యంతం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లేమితో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెల్సిందే. జట్టు కెప్టెన్‌గానే కాకుండా, ఆటగాడిగా కూడా ఫెయిల్ కావడంతో విమర్శలు వస్తున్నాయి. 
 
అలాగే, ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రోహిత్ శర్మ టెస్టులకు గుడ్‍‌బై చెప్పే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే జట్టు సారథ్య పగ్గాలను విరాట్ కోహ్లీకి అప్పగించే అవకాశం ఉన్నట్టు సమాచారం. దీనికి ఇటీవల భారత మాజీ కెప్టెన్ ఫీల్డ్‌లో ఎక్కువగా కల్పించుకోవడంతో పాటు జట్టు ఆటగాళ్ళను ఉత్సాహపరిచేందుకు తరచూ ప్రసంగించడం చేస్తున్నాడని టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ నివేదిక ప్రకటించింది. 
 
కాగా, భారత క్రికెట్ జట్టులో అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌లలో కోహ్లీ ఒకరు. టీమిండియాకు 68 టెస్ట్ మ్యాచ్‌లలో సారథ్యం వహిస్తే 40 మ్యాచ్‌లు గెలిపించాడు. అలాగే, ఇందులో 17 ఓటములు ఉన్నాయి. అటు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న తొలి భారత కెప్టెన్‌ కూడా కోహ్లీనే కావడం గమనార్హం. 
 
అలాగే, ప్రస్తుత టెస్ట్ జట్టులో సీనియర్ ఆటగాడు కూడా కోహ్లీనే కావడం గమనార్హం. ఒక్క జస్ప్రీత్ బుమ్రా మినహాయిస్తే జట్టు పగ్గాలు చేపట్టే ఆటగాడు ఇప్పటికిపుడు జట్టులో లేరు. అందుకే, రోహిత్ శర్మ సారథ్యం నుంచి తప్పుకుంటే ఆ స్థానాన్ని విరాట్ కోహ్లీతో భర్తీ చేసేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది.