బుధవారం, 15 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 13 అక్టోబరు 2025 (14:25 IST)

హాస్టల్ బాత్రూమ్‌లో ఉరితాడుకు వేలాడిన విద్యార్థిని - విచారణకు కలెక్టర్ ఆదేశం

suicide
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా గురుకుల పాఠశాలలో విషాదకర ఘటన జరిగింది. హాస్టల్ వాతావరణం బాగాలేకపోవడంతో ఓ విద్యార్థిని హాస్టల్ మరుగుదొడ్డిలోనే ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. హాస్టల్ ఏమాత్రం నచ్చడం లేదని తన తల్లిదండ్రులకు మూడు రోజుల క్రితం ఫోన్ చేసి చెప్పిన ఆ విద్యార్థిని ఇపుడు శవమై కనిపించింది. దీనిపై జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ వివరాలను పరిశీలిస్తే,
 
గద్వాల జిల్లా మల్దకల్ పట్టణానికి చెందిన ప్రియాంక (15) అనే బాలిక పాలమూరు జిల్లా మహబూబ్ నగర్ మండలం రామ్ రెడ్డి గూడెంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యాభ్యాసం చేస్తూ అక్కడే ఉన్న హాస్టల్‌లో ఉంటుంది. సోమవారం ఉదయం ఆమె బాత్రూమ్‌‍కు వెళ్లి గంటల సమయం గడిచినా బయటకురాలేదు. దీంతో సహచర విద్యార్థులకు అనుమానం రావడంతో వార్డెన్‌కు సమాచారం చేరవేసారు. ఆ తర్వాత సిబ్బంది వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. బాలికను కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రియాంక చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. 
 
మూడు రోజుల క్రితం తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఇక్కడి హాస్టల్‌లో వాతావరణం ఏమీ బాగోలేదని, ఇక్కడ చదవలేనని, ఇంటికి వచ్చేస్తానని చెప్పినట్టు సమాచారం. అయితే, తాము సోమవారం వచ్చి మాట్లాడుతామని తల్లిదండ్రులు ఆమెకు నచ్చజెప్పగా వారు వచ్చేలోపు ఈ ఘోరం జరిగిపోయింది. ఈ గురుకుల వసతి గృహంలో 800 మందికిపైగా విద్యార్థులు ఉండటంతో తమ కుమార్తె తీవ్ర అసౌకర్యానికి గురై బలవన్మరణానికి పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు బోరున విలపిస్తూ చెప్పారు. 
 
కాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ జయేంద్ర హాస్టల్‌కు చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను పరిశీలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు.