భార్యను హత్య చేసి... తర్వాత ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించిన భర్త
కేరళ రాష్ట్రంలోని కొల్లంలో ఓ దారుణం జరిగింది. భార్యను హత్య చేసిన ఓ కిరాతక భర్త... ఆ విషయాన్ని ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించారు. మృతురాలిని కొల్లంకు చెందిన శాలిని (39)గా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత ఆ కిరాతక భర్త ఇసాక్ (42) పునాలూర్ పోలీస్ స్టేషనులో లొంగిపోయాడు.
పోలీసుల కథనం ప్రకారం.. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన ఇసాక్ రబ్బర్ ట్యాప్పర్‌గా పనిచేస్తున్నాడు. శాలిని సమీపంలోని పాఠశాలలో సహాయకురాలిగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు. అయితే శాలినికి, ఇసాక్‌కు మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం 6:30 గంటలకు బాధితురాలు వంట గది వెనక ఉన్న పైపులైన్ వద్దకు స్నానానికి వెళ్లింది.
ఈ సందర్భంగా ఇసాక్ ఆమెపై కత్తితో దాడిచేశాడు. దీంతో శాలిని మెడ, ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలై మరణించింది. అనంతరం ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి తన భార్యను హత్య చేసినట్లు ఇసాక్ వివరించాడు. శాలిని ఎప్పుడూ తన మాట వినలేదని, తన తల్లితోనే కలిసి నివసించడానికి వెళ్లిందని ఆరోపించాడు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.