మృత్యుశకటాలుగా స్లీపర్ బస్సులు, అందుకే చైనాలో బ్యాన్
స్లీపర్ బస్సులు ప్రమాదానికి గురైతే వాటిలో ప్రయాణించేవారు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు జరుగుతున్నాయి. స్లీపర్ బస్సులు డిజైన్ లోపం కారణంగానూ, వాటిలో బెర్తుల కోసం వాడే ఫోమ్ వల్ల కూడా ప్రమాదం జరిగితే దాని తీవ్రత అత్యధికంగా వుంటోంది. ప్రమాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతున్న ఈ స్లీపర్ బస్సులపై ప్రభుత్వాలు సమీక్షించాల్సి వుంది. చైనా దేశం మాత్రం ఇలాంటి చేదు ఘటనలతో గుణపాఠం నేర్చుకుంది. స్లీపర్ బస్సులను నిషేధించింది.
2009 తర్వాత చైనాలో జరిగిన 13 స్లీపర్ బస్సు ప్రమాదాలలో దాదాపు 252 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనితో స్లీపర్ బస్సుల డిజైన్, వాటి పనితీరు సమీక్షించారు. చాలా స్లీపర్ బస్సులు డబుల్-డెక్కర్ తరహాలో రెండు స్థాయిల బెర్తులను కలిగి ఉంటాయి. దీని వలన బస్సు ఎత్తు పెరిగి, గురుత్వ కేంద్రం కూడా పైకి పోతుంది. ఫలితంగా, బస్సు ఎక్కువ వేగంతో వెళ్లినప్పుడు లేదా అకస్మాత్తుగా బ్రేక్ వేసినప్పుడు త్వరగా బోల్తా పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
బస్సు లోపల బెర్తులు, ఇరుకైన దారుల కారణంగా, ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు త్వరగా బయటకు వెళ్లడం కష్టమవుతుంది. అత్యవసర ద్వారాలు కూడా సరిపడా ఉండకపోవచ్చు లేదా ప్రమాదంలో జామ్ అయ్యే అవకాశం ఉంది. బస్సు లోపల ఉపయోగించిన పరుపులు, దుప్పట్లు, కర్టెన్లలో కొన్నిసార్లు సులభంగా మంటలు అంటుకునే పదార్థాలు ఉండటం వలన అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నష్టం ఎక్కువగా ఉంటుంది.
ఈ భద్రతాపరమైన సమస్యలు, వరుస ప్రమాదాల నేపథ్యంలో, చైనా ప్రభుత్వం 2012 నుండి కొత్త స్లీపర్ బస్సుల ఉత్పత్తి, రిజిస్ట్రేషన్‌ను పూర్తిగా నిలిపివేసింది.
కర్నూలు బస్సు ప్రమాదం విషయానికి వస్తే... క్రాస్ రోడ్ల వద్ద ఆగి చూసి వెళ్లడం అనేది అక్కడ జరిగి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదు. అనేక ప్రాణాలను కాపాడబడి ఉండేవి. వేగవంతంగా వెళ్లే వాహనాలు మన దేశంలోకి వచ్చాయి, కానీ వాటికి తగ్గ రోడ్డు భద్రతా జాగ్రత్తల పట్ల అవగాహన ఇంకా కొరవడింది. భద్రతా నియమాలు తప్పకుండా పాటించాలి. బస్సులో అత్యవసర పరిస్థితుల్లో అన్ని తలుపులు తెరుచుకునే సాంకేతిక పద్ధతులు తప్పనిసరిగా ఉండాలి.