బుధవారం, 20 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2025 (12:11 IST)

కత్తులు గొడ్డళ్లతో 52 మందిని నరికివేశారు... ఎక్కడ?

murder
ఆఫ్రికా దేశమైన కాంగోలో ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు. కత్తులు, గొడ్డళ్లతో ఏకంగా 52 మందిని నరికి చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు తెలిపారు. 
 
కాంగో దళాల చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేని అలైట్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు వెల్లడించారు. బెని, లుబెరో ప్రాంతాల్లోని పౌరులపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడికి పాల్పడినట్టు వెల్లడించారు. నిద్రపోతున్న ప్రజలను లేపి, తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్ళతో అతి కిరాతకంగా నరికి చంపారని తెలిపారు. 
 
మొలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పటించారని మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడివున్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్. ఈ సంస్థ ఉగాండా, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్ళుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6 వేల మంది పౌరులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హత్య చేశారు. దీంతో ఏడీఎఫ్‌పై అమెరికా, ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి.